
- ఏప్రిల్ 6న సీతారాముల కల్యాణం, 7న పట్టాభిషేక మహోత్సవం
- వచ్చే నెల 12వ తేదీ వరకు నిత్య కల్యాణాలు రద్దు
భద్రాచలం, వెలుగు: భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఉగాది(ఆదివారం) నుంచి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ అవుతాయి. ఏప్రిల్6న సీతారాముల కల్యాణం, 7న శ్రీసీతారామ పట్టాభిషేకం జరుగుతాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నుంచి వచ్చే నెల12 వరకు ఆలయంలో నిత్య కల్యాణాలు రద్దు చేశారు.
బ్రహ్మోత్సవాలకు దేవస్థానం రూ.2.50కోట్లతో ఏర్పాట్లు చేపట్టింది. మిథిలాస్టేడియంలో 31వేల మంది భక్తులు సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం చూసేలా తీర్చిదిద్దారు. ఎండల నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేలా ఫాగ్ సదుపాయాలను స్టేడియం ఆవరణలో కల్పిస్తున్నారు. కలెక్టర్జితేశ్ వి పాటిల్చొరవతో ఏర్పాట్లు చేస్తున్నారు. 50 టన్నుల భారీ ఏసీ, వంద కూలర్లు, 250 ఫ్యాన్లను కూడా అమర్చుతున్నారు.
భద్రాచలం, పర్ణశాలలో భక్తులకు చలువ పందిళ్లను నిర్మిస్తున్నారు. మజ్జిగ, చల్లని తాగునీటి ప్యాకెట్లను ఇవ్వనున్నారు. భక్తుల కోసం19 ప్రసాద, 60 తలంబ్రాల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. 200 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేస్తున్నారు. నవమి అనంతరం పోస్టల్, ఆర్టీసీ కార్గో ద్వారా ప్రసాదాలు, తలంబ్రా లు పంపిణీకి చేయనున్నారు. భద్రాచలం రాలేని భక్తులకు దేవస్థానం ఆన్లైన్ ద్వారా పరోక్ష పూజా కార్యక్రమాలు చేపట్టింది.
ప్రసాదాల కొరత రాకుండా 2 లక్షల లడ్డూలు, 10వేల పెద్ద లడ్డూలను తయారు చేయిస్తుం ది. ప్రసాదాల నాణ్యతను ఎప్పటికప్పుడు ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ప్రైవేటు ప్రసాదాల అమ్మకాలపై నిషేధం విధించారు. ఏప్రిల్ 6,7 తేదీల్లో భద్రాచలంలో మద్యం షాపులను మూసివేయాలని ఇప్పటికే కలెక్టర్ఆదేశించారు. 2 వేల మంది పోలీసులతో ఎస్పీ రోహిత్‌రాజ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ భద్రతా ఏర్పాట్లు చేశారు.
సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక
ఈసారి సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. ఏప్రిల్ 6న ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. గత పదేండ్లలో అప్పటి సీఎం కేసీఆర్ రెండు సార్లు మాత్రమే వచ్చారు. రామదాసు శాసనం ప్రకారం సంప్రదా యంగా ముఖ్యమంత్రి రావాల్సి ఉంది. కేసీఆర్ రాకపోవడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. గతేడాది పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా సీఎం రేవంత్ రెడ్డి రాలేకపోయారు.
ఎన్నికల సంఘం నుంచి అనుమతి కోరినా నిరాకరించింది. ఈసారి కచ్చితంగా వస్తానని, ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తానని సీఎం రేవంత్ హామీ ఇవ్వడంతో ఏర్పాట్లు స్పీడ్ గా చేస్తున్నారు. ఆలయం చుట్టూ ఉన్న 45 ఇండ్లను భూసేకరణలో భాగంగా తీసుకున్నారు. ఇప్పటికే రూ.34 కోట్లను నిర్వాసితులకు చెల్లించారు. దీంతో మాడవీధుల విస్తరణ, ఇతర పనులకు ప్రభుత్వం నిధులు భారీగా మంజూరు చేసే అవకాశం ఉంది.