భద్రాద్రిలో శాస్త్రోక్తంగా సదస్యం..కల్యాణ రాముడికి మహదాశీర్వచనం

భద్రాద్రిలో శాస్త్రోక్తంగా సదస్యం..కల్యాణ రాముడికి మహదాశీర్వచనం

భద్రాచలం, వెలుగు: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి ప్రాంగణంలో కల్యాణ రాముడికి మంగళవారం మహదాశీర్వచనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బేడా మండపంలో నిత్య కల్యాణ వేదిక వద్ద ఈ కార్యక్రమాన్ని వేదోక్తంగా చేశారు. కొత్త వధూవరులైన సీతారాములకు వేదపండితులు వేదాశీర్వచనం ఇవ్వడమే సదస్యం పరమార్థం.  సీతారాముల కల్యాణ క్రతువులో పాల్గొని తిలకించిన భక్తులకు సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అంతర్భాగంగా వేడుకుంటారు.

తెలుగు రాష్ట్రాల నుంచి చతుర్వేద పండితులు, ద్రవిడ దివ్యప్రబంధ పారాయణం చేసేందుకు తరలివచ్చి భద్రాద్రి రాముడికి ఆశీర్వచనం పలికారు. కల్యాణమూర్తులను నిత్య కల్యాణ మండప వేదిక వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హంసవాహనంపై తిరువీధి సేవగా స్వామివారు వెళ్లారు. రాజవీధి గుండా తాతగుడి సెంటర్‍లోని గోవిందరాజస్వామి ఆలయంలో పూజలందుకుని తిరిగి ఆలయానికి వచ్చారు.