భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఐదుగురు కూలీలతో రూ. కోట్ల విలువ చేసే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులెట్లా పూర్తి అవుతాయంటూ కలెక్టర్ అనుదీప్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ లో పట్టణ ప్రగతి పనులపై జిల్లాలోని మున్సిపాలిటీ చైర్మన్లు, కమిషనర్లు, డీఈలు, ఏఈలు, టీపీవోలతో బుధవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పనులు స్లోగా జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈఈ, డీఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేస్తుంటే మీలో చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వేసవిలో మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ వెహికల్స్‌కు ఫ్యుయల్ వినియోగంపై పర్యవేక్షణ ఉండాలన్నారు. 15 రోజుల్లో అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన క్రీడా ప్రాంగణాలు పూర్తి చేయాలన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో చేపట్టిన ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణ పనులను వీడియో ద్వారా పరిశీలించారు. కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్లు కె. సీతాలక్ష్మి, డి.వెంకటేశ్వరరావు, కొత్తగూడెం మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అర్జున్, మున్సిపల్ కమిషనర్లునవీన్, శ్రీకాంత్, మాధవి, అంకుషావళి పాల్గొన్నారు.
టీబీ రహిత జిల్లాగా మార్చాలి
టీబీ రహిత జిల్లాగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. పట్టణంలోని ఐఎంఏ హాల్లో టీబీ వ్యాధి, తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులు, సిబ్బందికి బుధవారం ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 18 ఏండ్ల వయస్సు వారు టీబీ బారిన పడకుండా చేపట్టాల్సిన చర్యలపై శిక్షణ ఇవ్వడం హర్షణీయమన్నారు. అన్ని ప్రాథమిక కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్లలో టీబీ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. బూర్గంపహాడ్, అశ్వారావుపేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో పిల్లల వైద్య నిపుణులను నియమించేందుకు ప్రపోజల్స్ ఇవ్వాలని డీఎంహెచ్‌వో దయానందస్వామిని ఆదేశించారు. టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్, ఎంజీఎం పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ విజయ్‌కుమార్, ఉస్మానియా హాస్పిటల్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.