ములకలపల్లి, వెలుగు : పంటల మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ రైతులకు సూచించారు. శుక్రవారం ములకలపల్లి మండలంలోని కొత్తూరు, వీకే రామవరం, ఒడ్డు రామవరం, ములకలపల్లి,సీతారాంపురంలో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో కొత్తూరులో గిరిజన రైతు సోయం కృష్ణ సాగుకు సిద్ధం చేస్తున్న మునగ మొక్కలను పరిశీలించారు. తేనెటీగల పెంపకం తో పాటు సమీకృత వ్యవసాయం చేస్తున్న చందర్రావు రైతు తోటను సందర్శించారు.
పామాయిల్ తోటలోనాటు కోళ్ల పెంపకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఒక పంట మీదనే ఆధారపడకుండా సీజన్ వారీగా పంటలను పండిస్తూ, ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని కలెక్టర్తెలిపారు. ఎన్ఆర్జీఎస్ ద్వారా మునగ పంటను సాగు చేస్తున్నవారికి ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందుతాయని కలెక్టర్ తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించారు.
ఆవరణలో గడ్డి పెరగడాన్ని చూసి వెంటనే శుభ్రం చేయాలని కాలేజీ సిబ్బందిని ఆదేశించారు. కళాశాలకు కావాల్సిన సౌకర్యాలపై ప్రతిపాదనలు సమర్పించాలని పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావుకు సూచించారు. ఆవరణలో వాలీబాల్, షటిల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కేజీబీవీని పరిశీలించారు. ఆహారం, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ లో రాష్ట్రస్థాయిలో రెండో స్థానం సాధించిన పి. సౌమ్య అనే విద్యార్థినిని అభినందించారు.
కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ విద్యా చందన, సీపీవో శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాసరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచన రాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, డీఈవో వెంకటేశ్వరచారి, ఏడీఏ అబల్ బేగం, తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీవో భారతి, ఎంఈవో శ్రీరామ్ మూర్తి, జీసీడీపీవో అన్నామని, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సక్కుబాయి ఉన్నారు.