- ముంపు ప్రాంతాల్లో భద్రాద్రి కలెక్టర్ పర్యటన
భద్రాచలం, వెలుగు: గోదావరి వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బుధవారం పర్యటించారు. భద్రాచలంలోని విస్తా కాంప్లెక్ వద్ద గోదావరి కరకట్టను పరిశీలించారు. స్లూయిజ్‌లు పనిచేసే తీరును స్వయంగా పర్యవేక్షించారు. అవసరమైతే అదనంగా పంపింగ్ మోటార్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. చర్ల మండలం కలివేరులో పు నరావాస కేంద్రంగా ఏర్పాటు చేసిన రైతు వేదికను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
అలాగే రూ.38 కోట్ల వ్యయంతో కూనవరం రోడ్డులో నిర్మిస్తున్న నూతన కరకట్ట పనులు తనిఖీ చేశారు. భద్రాచలం పట్టణంలోని ముంపు కాలనీలను సందర్శించారు. వరదల సమయంలో సీడబ్ల్యూసీ రిపోర్టులే కీలకమని, గంట గంటకు ఒకసారి వరద లెవల్స్ పరిశీలించి రిలీజ్ చేయాలన్నారు. ఇరిగేషన్ ఇంజినీర్లు కూడా సీడబ్ల్యూసీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గిరిజన గ్రామాలు వరద తాకిడికి గురికాకుండా శాశ్వత పరిష్కారం చూపించేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. ముందుగానే పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించాలని చెప్పారు. ఏఎస్పీ పంకజ్ పరితోష్, ఆర్డీవో దామోదర్, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, డీపీవో సుధీర్ తదితరులు కలెక్టర్‌వెంట ఉన్నారు.
మెనూ ప్రకారం పౌష్టికాహారం
మెనూ ప్రకారం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ, హాస్టళ్లలో చదివే విద్యార్ధులకు పౌష్టికాహారం అందజేయాలని కలెక్టర్, ఇన్చార్జి ఐటీడీఏ పీవో జితేశ్ వి పాటిల్ఆదేశించారు. భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌ను బుధవారం ఆయన సందర్శించి బాలికలతో కలిసి భోజనం చేశారు. వర్షాకాలంలో హాస్టళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, తేళ్లు, పాములు వంటి విష పురుగులు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్డీవో దామోదర్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మ, ఏసీఎంవో రమణయ్య, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.