ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేర మోసం... రూ.లక్షల్లో వసూలు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేర మోసం... రూ.లక్షల్లో వసూలు
  • రూ.లక్షల్లో వసూలు చేసిన కలెక్టరేట్  క్యాంప్​ ఆఫీస్​ ఉద్యోగి
  • విచారణకు ఆదేశించిన కలెక్టర్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్, మెడికల్​ కాలేజీతో పాటు జీజీహెచ్​లో ఔట్  సోర్సింగ్​లో ఉద్యోగాలిప్పిస్తానంటూ కలెక్టర్​ క్యాంప్​ ఆఫీస్​లో పని చేసే ఉద్యోగి రూ. లక్షల్లో వసూలు చేశాడు. విషయం తెలిసి ఉద్యోగిపై కలెక్టర్​ సీరియస్​ అయ్యారు. కానీ, అప్పటికే ఆ ఉద్యోగి పారిపోయాడు.  

కలెక్టరేట్​లో ఫోర్త్​ క్లాస్​ ఎంప్లాయ్​గా హర్షద్  కొంత కాలంగా కలెక్టర్​ క్యాంప్​ ఆఫీస్​లో పని చేస్తున్నారు. గ్రీవెన్స్ కు​ఉద్యోగాల కోసం వచ్చే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. ఒక్కో ఉద్యోగానికి రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షలు ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నాడు. ఇలా రూ.50 వేల నుంచి రూ. లక్ష చొప్పున అడ్వాన్స్​గా తీసుకున్నాడు. వర్క్​ ఆర్డర్​ ఇచ్చిన తరువాత మిగిలిన డబ్బులు ఇవ్వాలని ఒప్పందం​ చేసుకున్నారు. 

ఇటీవల కొందరికి నకిలీ వర్క్​ ఆర్డర్​ కాపీలను ఇచ్చాడు. ఈ క్రమంలో కొందరు వర్క్​ ఆర్డర్​ తీసుకొని మెడికల్  కాలేజీతో  పాటు తమకు చెప్పిన డిపార్ట్​మెంట్లకు వెళ్లగా, ఫేక్​ ఆర్డర్​ కాపీలని ఆఫీసర్లు తేల్చారు. బాధితులు హర్షద్ కు ఫోన్​ చేయగా, ఏదో పొరపాటు జరిగిందంటూ పది రోజులుగా నమ్మిస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లడంతో, ఇది గమనించిన హర్షద్​ పరారయ్యాడు. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని ఆఫీసర్లను కలెక్టర్​ ఆదేశించారు.