
పినపాక, వెలుగు: కల్లంలో ఎండబెట్టిన మిర్చిని తగులబెట్టిన కేసులో ఇద్దరిని భద్రాద్రి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మీడియా సమావేశంలో ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరావు, ఎస్ఐ రాజ్కుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు. పినపాక మండలం వెంకట్రావుపేటకు చెందిన రైతు పొనగంటి పురుషోత్తం మిర్చి పంటను ఏరి చేను వద్ద కల్లంలో ఎండబెట్టాడు.
కాగా అదే గ్రామానికి చెందిన తాండ్ర బాలకృష్ణ, మంచర్ల వెంకటేశ్వర్లు కలిసి ఈనెల10న మిర్చి కల్లం వద్ద ఎవరూ లేకపోవడంతో వెళ్లి ఐదు లీటర్ల పెట్రోలు చల్లి నిప్పంటించి పరార్ అయ్యారు. దీంతో 70 క్వింటాళ్ల మిర్చి కాలిపోయింది. బాధితుడు పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సోమవారం వెంకటేశ్వరపురం వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా వెంకటేశ్వర్లు పోలీసులను చూసి బైక్పై పారిపోతుండగా వెంబడించి పట్టుకుని విచారించారు.
గతేడాది బాలకృష్ణ భార్య చనిపోవడానికి, తనను పెద్దమనిషిగా ఎదగనీయకుండా అడ్డుపడుతుండడానికి పురుషోత్తమే కారణమని కక్ష గట్టి ఆర్థికంగా దెబ్బ తీసేందుకు మిర్చిపంటకు నిప్పుపెట్టినట్టు ఒప్పుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. వారం రోజుల్లోనే కేసును చేధించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను మణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి అభినందించారు.