- మొదటి ప్రమాద హెచ్చరికకు ముందే కరకట్ట స్లూయిజ్‌లను మూసిన్రు
- టౌన్‌లోని నీళ్లను గోదావరిలో ఎత్తిపోసే మోటర్లు ఆన్చేయలే
- రామాలయ పరిసరాలను ముంచెత్తిన వరద
- భక్తులు నిద్ర లేచేసరికి లాడ్జీల చుట్టూ చేరిన నీళ్లు
- దుకాణాల్లోకి వరదతో వ్యాపారులకు నష్టం
- ఆఫీసర్ల తీరుకు నిరసనగా ఆర్డీవో కార్యాలయం ముట్టడి
భద్రాచలం, వెలుగు : ఓ వైపు భద్రాచలం.. మరోవైపు గోదావరి.. మధ్యలో కరకట్ట..గోదావరి వరద 43 అడుగులకు చేరితే కరకట్టకున్న స్లూయిజ్‌లను ఇరిగేషన్ ఆఫీసర్లు మూసేయాలి. లేదంటే గోదావరి నీళ్లు పట్టణంలోకి రివర్స్ వస్తాయి. అదే సమయంలో వర్షపు నీరు పట్టణాన్ని ముంచెత్తకుండా మోటర్లతో గోదావరిలోకి ఎత్తిపోయాలి. ఇందుకోసం రాత్రంతా ఇరిగేషన్ ఆఫీసర్లు కరకట్టల దగ్గరే మకాం వేసి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాగానే స్లూయిజ్‌లను మూసి, మోటర్లు ఆన్చేయాలి. కానీ, వరద 39 అడుగులకు చేరకముందే రాత్రి12 గంటలకు స్లూయిజ్‌లను మూసేసిన ఆఫీసర్లు ఎంచక్కా ఇండ్లకు వెళ్లి పడుకున్నారు.
వర్షం అర్ధరాత్రి నుంచి తెల్లవారే దాకా కుండపోత పోయడం, గోదావరిలోకి ఎత్తిపోసే మోటర్లు ఆన్ చేయకపోవడంతో వాన నీరంతా ఆలయ పరిసరాలను ముంచెత్తింది. రాముడిని దర్శించుకునేందుకు వచ్చి బుధవారం రాత్రి బస చేసిన భక్తులు నిద్రలేచేసరికి లాడ్జీల చుట్టూ నీళ్లు చేరాయి. దుకాణాలు సైతం మునగడంతో నష్టపోయిన వ్యాపారులు ఇరిగేషన్ ఆఫీసర్ల తీరుకు నిరసనగా గురువారం ఆర్డీవో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు.
అన్నీ మునిగిపోయినయ్
వానలతో భారీగా వరద వచ్చి చేరుతుండడంతో భద్రాచలం వద్ద గోదావరి గురువారం మధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులకు చేరింది. దీంతో కలెక్టర్ ప్రియాంక అలా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే హెచ్చరిక జారీ చేసిన తర్వాత స్లూయిజ్‌లను మూసివేసి మోటార్లు అన్చేయాల్సిన ఆఫీసర్లు, బుధవారం అర్ధరాత్రి గోదావరి 39 అడుగుల వద్ద ఉండగా స్లూయిజ్‌లను మూసేశారు. ఉదయం వరకు మోటార్లను ఆన్ చేయకపోవడంతో తెల్లారేసరికి పట్టణాన్ని నీళ్లు ముంచెత్తాయి. భద్రాచలంలో గోదావరి కరకట్టపై ఉన్న విస్తా కాంప్లెక్స్, అశోక్నగర్కొత్తకాలనీ రామాలయం, అశోక్‌నగర్ కొత్తకాలనీలోని ఇండ్లు జలమయమయ్యాయి. రామాలయం పరిసరాల్లోని పలు షాపుల్లోకి నీళ్లు వచ్చాయి. దుకాణాల్లోని రిఫ్రిజిరేటర్లు మునిగిపోగా సరుకులు నాని పాడైపోయాయి.
దిక్కుతోచని వ్యాపారులు విషయం తెలుసుకుని వెళ్లి గొడవ చేశారు. దీంతో ఇరిగేషన్ఆఫీసర్లు రెండు మోటార్లు ఆన్‌చేశారు. రెండు మోటార్లతో ఎంత సేపు ఎత్తి పోస్తారని, మరో రెండు మోటార్లు ఆన్ చేయాని విన్నవించుకున్నా పట్టించుకోలేదు. దీంతో సుమారు 20 మంది వ్యాపారులు ఆర్డీవో ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు.
స్పందించిన ఆర్డీవో రత్న కల్యాణి ఇరిగేషన్ఆఫీర్లతో మాట్లాడి మరో రెండు మోటార్లన్ ఆన్ చేయించారు. శాంతించిన వ్యాపారులు షాపులకు వెళ్లి వస్తువులను తరలించారు. రామాలయం పార్కింగ్ ప్లేస్‌లోకి కూడా నీళ్లొచ్చాయి. గోదావరికి కరకట్టలు లేకపోవడంతో దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో సీతవాగు పొంగి సీతమ్మవారి నారచీరలు, దుకాణాలు మునిగాయి.
వర్షం ఇలాగే కొనసాగితే 50 అడుగులకు..
24 గంటల పాటు గోదావరికి వరద ఇలాగే ఉంటుందని కేంద్ర జలసంఘం ప్రకటించిన నేపథ్యంలో వరద 50 అడుగుల గరిష్టస్థాయికి చేరే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 9 లక్షల 36వేల 996 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇంద్రావతి, ప్రాణహిత, తాలిపేరు ఉపనదుల నుంచి వరద పెరిగే అవకాశాలు ఉండడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఈ క్రమంలో కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భద్రాచలంలో పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అశోక్నగర్కొత్తకాలనీకి చెందిన 18 కుటుంబాలను నన్నపునేని మోహన్ హైస్కూల్ పునరావాస కేంద్రానికి తరలించారు.
వర్షపాతం ఇలా...
భద్రాచలంలో గురువారం 9.12 సెంటీమీటర్లు, బూర్గంపాడులో 6.16, మణుగూరులో 4.06, అశ్వాపురంలో 4.24, పినపాకలో 4.72, చర్లలో 10.04, దుమ్ముగూడెంలో 5.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో చెరువులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
పాపికొండల టూరిజం రద్దు
గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రమాదహెచ్చరికలు దాటి ప్రవహిస్తున్న తరుణంలో పాపికొండల టూరిజం రద్దు చేశారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దర్శనం కోసం వచ్చే యాత్రికులు పాపికొండల విహారయాత్రకు వెళ్తుంటారు. గోదావరి ప్రస్తుత పరిస్థితితో ప్రభుత్వం లాంచీ ప్రయాణాలపై నిషేధించింది. మరోవైపు భద్రాచలం, పర్ణశాల క్షేత్రాల్లో గోదావరి బోట్షికారును రద్దు చేశారు. పడవ ప్రయాణాలపై నిషేధాజ్ఞలు విధించారు.
గొడవ చేస్తే కానీ ఆన్ చేయలే
స్లూయిజ్‌లు మూసిన ఇరిగేషన్ ఇంజనీర్లు మోటార్లు ఆన్చేయలే. షాపుల్లోకి నీరు రావడంతో వెళ్లి గొడవ చేస్తే రెండు మోటార్లు ఆన్ చేశారు. వారి నిర్లక్ష్యంతో మేము నష్టపోయాం.
- సింగిడాల రామకృష్ణ, వ్యాపారి
తీరని నష్టం
నిద్ర లేచి చూసేసరికే షాపును నీరు చుట్టుమట్టింది. మా షాపుల్లోని ఫ్రిజ్‌లు మునిగి పాడైపోయాయి. షాపులోని సరుకులు నానిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఈ నష్టానికి బాధ్యులు ఎవరు? ప్రతి సంవత్సరం ఇదే తంతు. మాకు శాశ్వత పరిష్కారం చూపించాలె.
- సత్తిబాబు, వ్యాపారి