ఖమ్మం జిల్లాలో పెరిగిన ట్రాఫిక్​ సమస్య.. పోలీస్​స్టేషన్ల అప్​గ్రేడ్ ఎప్పుడో ? ఏమో ?

ఖమ్మం జిల్లాలో పెరిగిన ట్రాఫిక్​ సమస్య.. పోలీస్​స్టేషన్ల అప్​గ్రేడ్ ఎప్పుడో ? ఏమో ?
  • జాడలేని అశ్వారావుపేట సబ్​డివిజన్, ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్ల ఏర్పాటు
  • అప్ గ్రేడ్​ కోసం దుమ్ముగూడెం, పాల్వంచ, బూర్గంపహాడ్​పోలీస్​స్టేషన్ల ఎదురుచూపులు 
  • పెరుగుతున్న సమస్యలు.. ఇబ్బందుల్లో ప్రజలు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక సబ్​ డివిజన్​ ఏర్పాటు చేయాలని పోలీస్​ శాఖ నిర్ణయించింది. అవసరమున్న చోట ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్లు, పోలీస్​ స్టేషన్లను అప్​గ్రేడ్​ చేసేందుకు ఉన్నతాధికారులు ఎస్పీలను ఆర్నెళ్ల కిందట ప్రపోజల్స్​ అడిగారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట సబ్​ డివిజన్​, కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్ల ఏర్పాటుతో పాటు పాల్వంచ, దుమ్ముగూడెం, బూర్గంపహాడ్​ పోలీస్​ స్టేషన్లను అప్​గ్రేడ్​ చేయాలని కోరుతూ జిల్లా ఆఫీసర్లు ఉన్నతాధికారులకు ప్రపోజల్స్​పంపించారు. వాటి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితం కావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఏజెన్సీ ప్రాంతాల్లో అవస్థలు..

ఏజెన్సీ ప్రాంతమైన అశ్వారావుపేట నియోజకవర్గంలో సబ్​ డివిజన్​ లేకపోవడంతో మారు మూల గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. కేసుల విషయంలో డీఎస్పీని కలవాలంటే దాదాపు 60కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్వంచకు వెళ్లాల్సిందే. అశ్వారావుపేట నుంచి పాల్వంచకు బస్సు సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అష్టకష్టాలు పడి ఇంత దూరం వచ్చినా డీఎస్పీ అందుబాటులో లేకపోతే ఇక అంతే సంగతులు. ఈ క్రమంలోనే అశ్వారావుపేటలో సబ్​ డివిజన్​ ఏర్పాటు చేస్తూ పోలీస్​ అధికారులు గవర్నమెంట్​కు ఆర్నెళ్ల కిందట ప్రపోజల్స్​ పంపించారు. కానీ ఇప్పటికీ ఆ విషయంలో ఎలాంటి అప్​డేట్​ లేదు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.

అప్​గ్రేడ్​ కోసం ఎదురుచూపులు..

పారిశ్రామిక ప్రాంతాలైన పాల్వంచ,బూర్గంపహాడ్​ పోలీస్​ స్టేషనల్లో కేసులు పెరుగుతున్నాయి. నక్సల్స్​ ప్రభావిత ప్రాంతంగా పేరొందిన బూర్గంపహాడ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ఛత్తీస్​గఢ్​ నుంచి నక్సల్స్​ రాకపోకలకు వేదికగా దుమ్ముగూడెం పోలీస్​స్టేషన్​ ఉంది. ఎస్​హెచ్​ఓ సీఐ ఉండడం మూలంగా శాంతి భద్రతలను సీఐ, ఎస్సైలు షేర్​ చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో దుమ్ముగూడెం, పాల్వంచ, బూర్గంపహాడ్​ పోలీస్​ స్టేషన్లను అప్​గ్రేడ్​ చేయాల్సిన అవసరాన్ని జిల్లా పోలీస్​లు గుర్తించారు.  కానీ అడుగు ముందుకు పడడం లేదు. 

పెరిగిన ట్రాఫిక్​ సమస్య..

కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ట్రాఫిక్​ విపరీతంగా పెరిగింది. జిల్లాలో 2024 సంవత్సరంలో ఓవర్​ స్పీడ్​ కేసులు 949, డ్రంకెన్​ డ్రైవ్​ కేసులు 11,878, విత్​ ఔట్​ హెల్మెట్​ కేసులు 2,29,785, మైనర్​ డ్రైవింగ్​ కేసులు 99, ట్రిపుల్​ రైడింగ్​ కేసులు 2,871, విత్​ ఔట్​ సీట్​ బెల్ట్​ కేసులు 8,114 నమోదయ్యాయి. వీటిల్లో అత్యధికంగా కొత్తగూడెం, పాల్వంచలోనివే కావడం గమనార్హం. మెన్​ తక్కువగా ఉండడంతో ట్రాఫిక్​ నియంత్రణపై పూర్తి స్థాయిలో దృష్ట పెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలో  కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ప్రత్యేకంగా ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో చేసిన ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్ల ప్రపోజల్స్​ ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయి.

ట్రాఫిక్​ పోలీస్ స్టేషన్ ​ఏర్పాటు చేయాలి.. 

కొత్తగూడెంలో రోజురోజుకు ట్రాఫిక్​ సమస్య పెరుగుతోంది. ఇక్కడ ఇరుకు రోడ్లు, పార్కింగ్​ప్లేస్​లు లేక కూడా సమస్య పెద్దదవుతోంది. స్పెషల్​గా ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ ఏర్పాటు చేస్తే ఈ సమస్యలకు చెక్​ పెట్టొచ్చు. 
-శశిధర్, స్థానికుడు, కొత్తగూడెం

స్టేషన్లు త్వరలో శాంక్షన్ ​అవుతాయి.. 

అశ్వారావుపేట సబ్​ డివిజన్​ ఏర్పాటుతో పాటు కొత్తగా ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్లు, అప్​గ్రేడ్​అవ్వాల్సిన పోలీస్​ స్టేషన్లకు సంబంధించిన ప్రతిపాదనలను గతంలోనే ఉన్నతాధికారులకు పంపించాం. ప్రపోజల్స్​ను ఉన్నతాధికారులు పరిశీలించారు. త్వరలోనే శాంక్షన్​ అయ్యే అవకాశాలున్నాయి.-బి. రోహిత్​ రాజు, ఎస్పీ, భద్రాద్రికొత్తగూడెం