పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ సోమవారం పర్యటించారు. లోతువాగు, కెనాల్ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో పంట భూములు కోతకు గురవుతున్నాయని, లోతువాగు కిన్నెరసాని వాగులో కలుస్తున్న ప్రాంతం నేల మెత్తటి ఇసుకతో ఉందని, గతంలో రైతులు వెదురు మొక్కలు వేసినప్పటికీ కోతకు గురౌతున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఉపాధిహామీ పథకం, ఇరిగేషన్‌శాఖ అధికారులు సమన్వయంతో యాక్షన్ ప్లాన్ తయారు చేసి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం పాండురంగాపురం, జడ్పీహెచ్ఎస్ ను సందర్శించి క్రీడల్లో రాణించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ తిరుపతి, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, తహసీల్దార్ వివేక్, ఇరిగేషన్ డీఈ రాణి, ఎంపీవో నారాయణ, ఏపీఎం రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.