ఎన్నికల విధులు పక్కాగా నిర్వహించాలి : ప్రియాంక అలా

  • అధికారులు, సిబ్బందికి కలెక్టర్ల ఆదేశాలు

ఖమ్మం టౌన్​/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా విధులు నిర్వహించే సిబ్బంది అలర్ట్​గా ఉండాలని,  అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొనేలా చూడాలని  ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం కలెక్టర్లు వీపీ గౌతమ్​, ప్రియాంక అలా సూచించారు. బుధవారం ఆయా జిల్లా కలెక్టరేట్లలో  మీడియాతో మాట్లాడారు.  

సిబ్బంది ఓటేసేందుకు ఈడీసీ : కలెకర్ట్​ వీపీ గౌతమ్​  

  డ్యూటీలో ఉన్న సిబ్బందికి ఎలక్షన్​ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ) జారీ చేస్తామని, దాని ద్వారా ఓటు హక్కు ఉపయోగించుకోవచ్చని  కలెక్టర్ వీపీ గౌతమ్​ చెప్పారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ఉద్యోగికి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఓటు హక్కు  ఉండి,  రిటర్నింగ్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్ చూపించి ఎక్కడ విధులు నిర్వహిస్తే అక్కడి పోలింగ్ స్టేషన్ లో వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పారు.  ఖమ్మం పార్లమెంట్ కాకుండా ఇతర ఏరియాల నుంచి వచ్చి, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ఉద్యోగులకు యథావిధిగా పోస్టల్ బ్యాలెట్ ను అందించనున్నట్లు చెప్పారు.

ఈ నెల 18న లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూట్నీ  ఉంటుందని అన్నారు. నూతన కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేసి, నామినేషన్ ఫారాలు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.   అభ్యర్థి దేశంలో ఎక్కడైనా ఓటరుగా నమోదయివుండాలని, ప్రపోజర్లు ఆయా నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదై ఉండాలన్నారు. ఓటరు జాబితాలో ఓటరుగా నమోదైంది

 లేనిదీ తనిఖీ చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 14 వరకు ఓటరుగా నమోదుకు అవకాశం ఉన్నప్పటికీ, ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు చేసుకోవాలన్నారు.   85 ఏళ్ళు నిండిన వయో వృద్ధులు 6558 మంది, దివ్యాంగులు  26045 మంది హోం ఓటింగ్​కు అప్లయ్​ చేసుకున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 5 వరకు 52,987 ఎపిక్ కార్డులు పంపిణీ చేసినట్లు, 54,866 కార్డులు ప్రింటింగ్ కొరకు ఇచ్చినట్లు ఆయన అన్నారు.

పకడ్బందీ ఏర్పాట్లు

 జిల్లాలోని 1459 పోలింగ్ కేంద్రాలన్నిటిలో   కనీస సౌకర్యాలు   కల్పిస్తున్నట్టు తెలిపారు.  600 పోలింగ్ కేంద్రాల్లో బాత్ రూమ్​లు,  టాయిలెట్ల ఏర్పాట్లు చేశామన్నారు. ఈవీఎంల  మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా ఏసెగ్మెంట్ కు, ఏ ఈవీఎం లు వెళ్ళాలో ఆన్లైన్ ద్వారా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేశామన్నారు. శిక్షణా, అవగాహన కార్యక్రమాల నిర్వహణకు 146 ఈవీఎంల కేటాయింపు చేశామన్నారు. 

పటిష్ఠ బందోబస్తు : సీపీ సునీల్​ దత్​ 

జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సీవిజిల్, టోల్ ఫ్రీ 1950 పై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ జిల్లాలో 12 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 15 ఎస్ఎస్టీ, 15 ఎఫ్ఎస్టీ, పోలీసుల ద్వారా ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 54 కేసులు నమోదుచేసినట్లు, 359 లీటర్ల మద్యం, ఒక కిలో గంజాయి, రూ.77 లక్షల 10 వేల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. రూ.50 వేలకు పైబడి నగదుతో ప్రయాణిస్తున్నప్పుడు సంబంధిత నగదు డాక్యుమెంట్లు వెంట ఉండాలన్నారు.

జిల్లాలో    లా అండ్ ఆర్డర్ ఫిర్యాదులు రాలేదని ఆయన అన్నారు. అంతకు ముందు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్ ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి బుధవారం ప్రారంభించారు.  పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు.

  ఓటు హక్కు వజ్రాయుధం : కలెక్టర్​ ప్రియాంక అల

18 ఏండ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు కావాలని  భద్రాద్రి  కొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అలా సూచించారు.  పట్టణంలో బుధవారం 5కె రన్​ నిర్వహించారు.   పోస్టాఫీస్​ సెంటర్​ నుంచి లక్ష్మీదేవిపల్లి మండలంలోని మార్కెట్​ యార్డ్​ వరకు ఈ రన్​ కొనసాగింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ5కె రన్​ను ఎస్పీ రోహిత్​ రాజుతో కలిసి కలెక్టర్​ ప్రారంభించారు.  అనంతరం కలెక్టరేట్​లో సమావేశం నిర్వహించారు. 18 ఏండ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు కావాలన్నారు.

ఎస్పీ రోహిత్​ రోజు మాట్లాడుతూ ఓటరుగా నమోదవడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మంచి నాయకున్ని ప్రజాప్రతినిధిగా ఎన్నుకునేందుకు ఓటు హక్కు ప్రధానమని అన్నారు. ఈ ప్రోగ్రాంలో డీఆర్డీఓ విద్యాచందన, ఏఆర్​ఓ కాశయ్య, జిల్లా ఫారెస్ట్​ అధికారి కృష్ణగౌడ్​, జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి, జడ్పీ సీఈఓ ప్రసూనరాణి, మైనార్టీ సంక్షేమాధికారి సంజీవరావు, ఏఓ గన్యా పాల్గొన్నారు. 

ఖమ్మంలోని  ఐదు సెగ్మెంట్లలో 

మహిళ ఓటర్లు                      630888 
పురుషులు                            587803 
ట్రాన్స్ జండర్స్ ఓటర్లు       85
మొత్తం                                 12,18,776

భద్రాద్రిలోని  ఐదు సెగ్మెంట్లలో 

మహిళ ఓటర్లు                      506165
పురుషులు                            478085
ట్రాన్స్ జండర్స్ ఓటర్లు         56
మొత్తం                                 984906