అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న గవర్నమెంట్​ ఆఫీసులు​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ నిర్మాణం నాలుగు నెలల కింద పూర్తయినప్పటికీ సీఎం కేసీఆర్​ పర్యటన ఖరారు కాక పోవడంతో ఓపెనింగ్​కు నోచుకోవడం లేదు. సొంత భవనాలు లేక అద్దె బిల్డింగ్ లు, శిథిల భవనాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కొత్త బిల్డింగ్​లోకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తున్నారు. మే నెలలోనే సీఎం వచ్చే అవకాశం ఉందని పనులను స్పీడప్‌ చేశారు. పాల్వంచలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​లో జిల్లా ఆఫీసులకు  కలెక్టర్​ అనుదీప్​ గదులను కూడా కేటాయించారు. కలెక్టరేట్​ నిర్మాణానికి నాలుగున్నరేండ్లు పట్టగా, ఓపెనింగ్​కు ఇంకెన్నాళ్లు వేచి చూడాలోనని ఆఫీసర్లు, ప్రజలు అంటున్నారు. 

రూ.48 కోట్లతో..

కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని పాల్వంచలో సమీకృత కలెక్టరేట్  నిర్మాణానికి 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఫిబ్రవరిలో బిల్డింగ్​ పనులకు శంకుస్థాపన చేశారు. నిధుల లేమితో పనులు నెమ్మదిగా సాగాయి. కలెక్టర్​ అనుదీప్​ ప్రత్యేక చొరవ తీసుకొని ఏడాది కాలంగా కాంట్రాక్టర్లు, ఆర్అండ్​బీ అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులను పూర్తి చేసేలా చూశారు. తరుచూ పనులను పరిశీలించి పలుమార్లు కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చారు. మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పలుమార్లు కలెక్టరేట్​ పనులను పరిశీలించారు. రూ.48 కోట్లతో ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​తో పాటు కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్ల నివాస గృహాలు, మీటింగ్​ హాల్స్​ నిర్మించారు. జిల్లా ఆఫీసులు ఒకే చోట ఉండేలా ప్లాన్​ చేశారు. ఈ ఏడాది మే నెలలో సీఎం వచ్చే అవకాశం ఉందంటూ హడావుడి చేశారు. ఈ క్రమంలోనే మూడు వారాల కిందట 48 జిల్లా ఆఫీసులను అధికారులకు అలాట్​ చేశారు. ఆఫీసులలో ఫర్నిచర్​ సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. 

హడావుడికే పరిమితం..

సీఎం వచ్చే అవకాశం ఉండడంతో ఇటీవల హెలీప్యాడ్​ పనులను ప్రభుత్వ విప్​ రేగా కాంతారావుతో కలిసి కలెక్టర్​ పరిశీలించారు. కలెక్టరేట్​కు సమీపంలోని దాదాపు 20 ఎకరాల స్థలంలో సీఎం బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. కొంత భాగం శుభ్రం కూడా చేశారు. సీఎం వస్తున్నారంటూ బిల్డింగ్​ను ముస్తాబు చేశారు. తీరా సీఎం పర్యటన ఖరారు కాకపోవడంతో కలెక్టరేట్​ ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వస్తుంది. సీఎం అపాయింట్​మెంట్​ కోసం మంత్రి పువ్వాడ అజయ్, విప్​ రేగా కాంతారావు కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నెల చివర్లో సీఎం వస్తారని జిల్లాలో ప్రచారం సాగుతోంది.