భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని 1095 పోలింగ్ కేంద్రాలకు గాను 512 కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్టు కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. గురువారం కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 300 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ సెంటర్లుగా గుర్తించామన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే వారికి సంబంధించి 4500 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని చెప్పారు.
దివ్యాంగులు, 80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఇంటి వద్ద నుంచే ఓటు వేసేందుకు 725 మంది పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి వద్ద నుంచే ఓటు వేసే దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన వృద్ధుల వివరాలను సేకరించాలని చెప్పారు. ఓటు వేసే టైం లో వీడియోగ్రఫీ ఉండేలా ప్లాన్ చేయాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.
కలెక్టర్ కు ఓటర్ స్లిప్పు అందజేసిన సిబ్బంది
పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలకు గురువారం సిబ్బంది ఓటర్ స్లిప్పును అందజేశారు. పట్టణంలోని న్యూ ఇందిరా ప్రియదర్శిని స్కూల్లోని 72వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు కలిగిన కలెక్టర్ కు స్థానిక తహసీల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ఓటర్ స్లిప్పును ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ స్లిప్పు వెనుక క్యూఆర్ కోడ్ ఉంటుందని
దాన్ని స్కాన్ చేస్తే పోలింగ్ కేంద్రం సమాచారం లభిస్తుందని తెలిపారు. మూడు రోజుల్లో పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసే విధంగా నియోజకవర్గాలవారీగా షెడ్యూల్ రూపొందించినట్లు పేర్కొన్నారు. 15 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకువెళ్లి ఓటర్లు ఓటు వేయాలని సూచించారు.