భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చే ఎన్నికలు పూర్తిగా పోడు సమస్య చుట్టే తిరగనున్నాయి. దీంతో పాటు అధికార పార్టీని వర్గపోరు కలవరపెడుతున్నది. ఈ రెండు అంశాలు అధిష్ఠానానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అలాగే వామపక్షాలతో పొత్తు గండం కూడా బీఆర్ఎస్ను కలవరపెడుతోంది. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాలపై సీపీఐ, భద్రాచలంపై సీపీఎం కన్ను వేయడంతో ఎలా తేల్చాలో తెలియక తికమకపడుతున్నది. అలాగే పొంగులేటి రూపంలో మరో ఆపద కూడా ఆ పార్టీని వెంటాడుతోంది. మిగిలిన పార్టీలను సైతం అసమ్మతి, అసంతృప్తులు, వర్గపోరు సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో పోడు సమస్యను పరిష్కరించి వచ్చే ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను దక్కించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తమకున్న కేడర్‌తో అన్ని స్థానాలను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్పాలనను ఎండగడుతున్న బీజేపీ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందజేస్తున్న స్కీంలను ఓటర్లకు వివరిస్తూ జిల్లాలో పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది.
బీఆర్ఎస్లో సమన్వయ లోపం
జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాలున్నాయి. ఐదింటిలో కొత్తగూడెం మినహా నాలుగు అసెంబ్లీ స్థానాలు ఎస్టీలకే రిజర్వ్‌చేశారు. జిల్లాలో పోడు భూముల సమస్య ప్రధానంగా ఉంది. పోడు భూములకు పట్టాలతో నియోజకవర్గాల అభివృద్ధే లక్ష్యంగా తాము పార్టీ మారుతున్నామని కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, భానోత్ హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు అప్పట్లో ప్రకటించారు. కానీ సమస్యకు పరిష్కారం చూపకపోవడంతో గిరిజనులు ఆందోళనల బాట పట్టారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింపోయింది. ఈ మధ్య సీఎం అసెంబ్లీ వేదికగా పట్టాలిస్తామని ప్రకటించడంతో బీఆర్ఎస్ తరపున టికెట్వస్తే చాలు తాము గెలుస్తామనే ఆశతో సిట్టింగ్‌ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే సీఎం హామీ నెరవేర్చకపోతే అన్ని స్థానాలపై ఆశ వదులుకోవాల్సిందేనంటున్నారు.
కొత్తగూడెంలో వనమా వర్సెస్ జలగం, రేగా
2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన జలగం వెంకట్రావ్‌పై..టీజేఎస్, టీడీపీల మద్దతుతో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు గెలిచారు. తర్వాత ఈయన టీఆర్ఎస్లో చేరగా అప్పటినుంచి వనమా, జలగం వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకు..ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు మధ్య సఖ్యత లేదు. వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లి రావడం కూడా బీఆర్ఎస్కు మైనస్‌గా మారింది. నియోజకవర్గంలో రాఘవతో పాటు ఆయన అనుచరులు భూకబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. వీరికి పోటీగా రాష్ట్ర హెల్త్డైరెక్టర్గడల శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. ఆయన వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంపై కన్నేశారు. ఇక పొత్తు ఓకే అయితే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇల్లెందులోనూ ఎదురుగాలి
2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోరంపై మిత్రపక్షాల మద్దతుతో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన భానోత్హరిప్రియ గెలిచారు. గెలిచిన కొద్ది రోజుల్లోనే ఆమె గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరికీ పడడం లేదు. దీంతో ఆయన అసంతృప్త నేత పొంగులేటి వెంట నడుస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారని, అభివృద్ధి పనుల్లో కమిషన్లు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల సంఖ్య 50 మంది వరకు ఉండడంతో ఆ పార్టీకి ఇబ్బంది తప్పేలా లేదు.
పినపాక రేగాకు కలిసివచ్చేనా?
గత ఎన్నికల్లో పినపాకలో మిత్రపక్షాల మద్దతుతో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రేగా కాంతారావు, టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లుపై గెలిచారు. తర్వాత రేగా టీఆర్ఎస్లో చేరడంతో ఇద్దరికి సఖ్యత లేకుండా పోయింది. సోషల్‌మీడియా వేదికగా రెండు వర్గాల మధ్య వార్ నడుస్తోంది. పాయం వెంకటేశ్వర్లు పొంగులేటి వర్గానికి చెందిన లీడర్ కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల సంచలనం రేపిన ఫాంహౌస్ కేసులో రేగా కాంతారావు ఉండడంతో ఆయన డబ్బులకు ఆశపడే ఇదంతా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రేగా, ఆయన అనుచరులపై భూకబ్జాల ఆరోపణలు ఉన్నాయి. అలాగే కొన్ని వర్గాలను ఆయన పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
మెచ్చాకు, తుమ్మలకు పడుతలేదు
గత ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి టీఆర్ఎస్తరపున పోటీ చేసిన తాటి వెంకటేశ్వర్లుపై కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ మద్దతుతో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. దీంతో తాటి వెంకటేశ్వర్లుకు, మెచ్చాకు పడలేదు. అధిష్టానం పట్టించుకోకపోవడంతో తాటి కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు మాజీ మంత్రి, జిల్లా రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాడని పేరున్న తుమ్మల నాగేశ్వరరావుది ఇదే నియోజకవర్గం కావడం గమనార్హం. తాను సీనియర్లీడర్అయినా మెచ్చా నాగేశ్వర్రావు తనను కేర్ చేయడం లేదన్న అసంతృప్తితో తుమ్మల ఉన్నారు. దీంతో వీరిద్దరికి పొసగడం లేదు.
భద్రాచలం సీపీఎంకేనా?
గత ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్అభ్యర్థి తెల్లం వెంకట్రావ్‌పై కాంగ్రెస్అభ్యర్థి పొదెం వీరయ్య విజయం సాధించారు. అయితే వీరయ్య కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నాడని కాంగ్రెస్ నేతల్లో వ్యతిరేకత ఉంది. ఇక్కడ సీపీఎం బలంగా ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సున్నం రాజయ్యతో పాటు, మాజీ ఎంపీ మీడియం బాబురావు ఆసక్తిగా ఉన్నారు.
పట్టు నిలుపుకునేందుకు పడరాని పాట్లు
జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్ పడరాని పాట్లు పడుతోంది. ఈ పార్టీ నుంచి గెలిచిన ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో గెలిచిన అశ్వారావుపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్లోకి చేరడంతో పార్టీకి తీరని నష్టం కలిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఫుల్క్యాడర్ ఉన్నప్పటికీ వారిని నడిపించే నాయకుడు లేడనే విమర్శలున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై పార్టీలోని పలు మండలాల్లోని కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌కు అద్బుతమైన ఓటు బ్యాంక్ ఉన్న టైంలో ఆ పార్టీని కాపాడేందుకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇటీవలికాలంలో చేపట్టిన పాదయాత్ర కార్యకర్తల్లో జోష్ నింపింది.
పాగా వేసేందుకు..
జిల్లాలో పాగా వేసేందుకు బీజేపీ ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతోంది. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతోంది. బూత్ లెవెల్ కమిటీలు వేస్తూ గ్రామస్థాయిలో బీజేపీ చొచ్చుకుపోతొంది. గతంలో కన్నా భారీగా క్యాడర్‌ను పెంచుకునే పనిలో నాయకులున్నారు.
కొత్తగూడెం నుంచి పొంగులేటి పోటీ?
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్కు దడపుట్టిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు జరిగిన అవమానాలను ప్రజలకు వివరిస్తూ క్యాడర్‌ను ఆకట్టుకునే పనిలో పడ్డారు. తాను ఏ పార్టీలో చేరినా అశ్వారావుపేట నుంచి జారె ఆదినారాయణ పోటీ చేస్తారని ప్రకటించి సంచలనం రేపారు. ఇక ఇల్లెందు నుంచి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పినపాక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును రంగంలోకి దింపబోతున్నట్టు సమాచారం. ఇక పొంగులేటి ఎంపీ స్థానాన్ని వీడి కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్న దానిపైనే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.
గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు నియోజకవర్గాల వారీగా :
కొత్తగూడెం
వనమా వెంకటేశ్వరరావు , కాంగ్రెస్ : 81,118
జలగం వెంకట్రావ్, బీఆర్ఎస్, : 76,979,
ఇల్లెందు
బానోత్ హరిప్రియ, కాంగ్రెస్ : 70,664
కోరం కనకయ్య, టీఆర్ఎస్ : 67,757
భద్రాచలం
పొదెం వీరయ్య, కాంగ్రెస్ : 47,746
తెల్లం వెంకట్రావ్, బీఆర్ఎస్ : 35,961
అశ్వారావుపేట
మెచ్చా నాగేశ్వరరావు, టీడీపీ : 61,124
తాటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ : 48,007
పినపాక
రేగా కాంతారావు, కాంగ్రెస్ : 72,283
పాయం వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ : 52,718
రేగా కాంతారావు
అనుకూల అంశాలు :
ప్రభుత్వ విప్ పదవి
సోదరుడు విష్ణు చారిటబుల్ ట్రస్టు పేర సేవా కార్యక్రమాలు
నమ్మి వచ్చిన కార్యకర్తలకు అండగా ఉంటాడనే పేరు
ప్రతికూల అంశాలు :
ఒంటెత్తు పోకడ
గిరిజనేతరులపై వివక్ష
వర్గపోరుతో , దూరంగా ఉంటున్న నేతలు
వ్యతిరేకంగా ఉంటే కక్ష సాధిస్తారనే ఆరోపణలు
అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు
అనుకూల అంశాలు :
బీఆర్ఎస్ పార్టీ క్యాడర్
వివాద రహితుడు కావడం
ఏ పార్టీ వారు వెళ్లినా స్పందించే గుణం
ప్రతికూల అంశాలు :
పోడు భూముల సమస్య
సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల వర్గానికి దూరంగా ఉండడం
క్యాంప్ ఆఫీస్‌లో అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు
భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య
అనుకూల అంశాలు :
పార్టీలకతీతంగా అందరితో కలిసి పోవడం
సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదుకునే గుణం
సమస్యలపై స్పష్టమైన అవగాహన
పార్టీ మారాలనే ఒత్తిడి ఉన్నా కాంగ్రెస్‌లోనే కొనసాగడం
ప్రతి కూల అంశాలు :
దళితబంధులో అనుకూలంగా ఉన్న వారికే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు
తన చుట్టూ ఉన్న కోటరీని నమ్మి మోసపోవడం
ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ
అనుకూల అంశాలు :
విద్యావంతురాలు కావడంతో సమస్యలపై అవగాహన
నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడం
ప్రజలకు అందుబాటులో ఉండడం
ప్రతికూల అంశాలు :
షాడో ఎమ్మెల్యేగా ఉన్న భర్త హరిసింగ్, అనుచరులపై భూకబ్జాలు, అక్రమాల ఆరోపణలు
మున్సిపాలిటీ పాలకవర్గంలో జోక్యం
వర్గపోరును సమన్వయం చేయడంలో విఫలం
దళితబంధు స్కీం ఒక్క గ్రామానికే ఇవ్వడంపై వ్యతిరేకత
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
అనుకూల అంశాలు :
బలమైన క్యాడర్,
జనంతో మంచి సంబధాలు
ప్రతికూల అంశాలు :
మున్సిపాలిటీ పాలకవర్గంలో జోక్యం
కొడుకు రాఘవ అరాచకాలు
దళితబంధులో కమీషన్లు వసూలు చేశారనే ప్రచారం
వయసుపై బడడం, అనారోగ్యం