గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

 

గోదావరి వరద ఉగ్ర రూపం దాల్చింది. గంట గంటకు నీటిమట్టం పెరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాల నుంచి నీరు గోదావరికి  చేరుతోంది. మరో రెండు, మూడు అడుగుల వరకు నీటిమట్టం ఆదివారం (జులై 23) సాయంత్రం వరకు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 

 

గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో కరకట్టపైకి ఎవరిని రానివ్వకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. లంక గ్రామ ప్రజలు కూడా అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ ప్రియాంక అల సూచించారు.