యాపలగడ్డలో ఘనంగా పగిడిద్దరాజు జాతర

గుండాల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు జాతర ఘనంగా కొనసాగుతోంది. జాతరకు ఆంధ్ర, తెలంగాణ ఆరెం వంశీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొడవటంచ గ్రామ సమీపంలోని బర్ల గుట్టపై కొలువుతీరిన పగిడిద్ద రాజును ఆరెం వంశీయులు, గ్రామస్తులు డప్పు వాయిద్యాల మధ్య తీసుకువచ్చారు. యాపలగడ్డ సమీపంలో గుండాల, ఇల్లెందు ప్రధాన రహదారి పక్కన ఉన్న పగిడిద్దరాజు గద్దెలపై ప్రతిష్ఠించారు.

గురువారం మండల పరిధిలోని పోత్తిరెడ్డిగూడెం గ్రామ సమీపంలోని మడిమోర గుట్ట నుంచి సమ్మక్క వనదేవతను గుడి వద్దకు తెచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పడగలతో భారీగా ఊరేగించి, గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా సమ్మక్క, పగిడిద్దరాజు ఎదుర్కొలు నిర్వహించారు. అనంతరం గద్దెల వద్దకు తీసుకు వచ్చి సమ్మక్క, పగిడిద్దరాజును ప్రతిష్ఠించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో స్థానిక ప్రాంతం కిక్కిరిసిపోయింది.

పగిడిద్దరాజును మేడారం ట్రస్ట్​బోర్డ్​ చైర్మర్​ లచ్చు​ పటేల్​ దర్శించుకున్నారు. ఆరెం వంశీయులతో మాట్లాడారు. పగిడిద్దరాజు జాతర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆరెం వంశీయులు కాంతారావు, సత్యం,  చిన్న కాంతారావు, అప్పాయ్య , నాగయ్య, ఇద్దయ్య, బసవయ్య, భిక్ష్యం పాల్గొన్నారు.