- అత్యధికంగా కొత్తగూడెం జిల్లాలో 1.51 లక్షల ఎకరాలు
- తక్కువగా నారాయణపేటలో
- 8 ఎకరాలు, పెద్దపల్లి జిల్లాలో ఎకరం
- లక్షన్నర మంది పోడు పట్టాదారులు.. 4.05 లక్షల ఎకరాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూములు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ జిల్లాలో 1.51 లక్షల ఎకరాల్లో పోడు సాగవుతున్నట్లు ధ్రువీకరించింది. ఇక్కడ 50,595 మంది పోడు పట్టాదారులు ఉన్నారని చెప్పింది. ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు పోడు సాగు, పోడు పట్టాదారులు ఉన్నారనే వివరాలను ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మంది పోడుదారులు ఉండగా, వీరి చేతుల్లో 4.05 లక్షల ఎకరాల్లో పోడు భూమి సాగవుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు మరో ఐదు జిల్లాల్లోనే ఎక్కువగా పోడు భూములను ప్రభుత్వం గుర్తించింది. మహబూబాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, నిర్మల్ జిల్లాల్లో 1,17,713 పోడు పట్టాదారులు ఉండగా, 3.36 లక్షల ఎకరాల పోడు భూమి సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ, కరీంనగర్, సిద్దిపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అసలు పోడు భూములే సాగు కావట్లేదు.
లెక్క మారింది!
పోడు భూములకు హక్కు పట్టాల కోసం 4.14 లక్షల మంది నుంచి 12.14 లక్షల ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 11.50 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఏకంగా దాదాపు 7.44 లక్షల ఎకరాలకు కోత పడింది. వాస్తవానికి అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం.. 2005 డిసెంబర్ కంటే ముందు అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు భూమిపై హక్కు కల్పిస్తూ పత్రాలు ఇవ్వాలి. ఇక, గిరిజనేతరులైతే మూడు తరాల వారి ఆక్రమణలో భూమి ఉన్నట్లు ఆధారాలు చూపించాలి. అంటే 2005కు ముందు 75 ఏండ్లుగా (మూడు తరాలు) సాగు చేసుకుంటున్నోళ్లు అర్హులుగా ఉంటారు. అయితే నాన్ ట్రైబల్స్‌కు సంబంధించి నిరూపించుకునేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో ఏపీ ప్రభుత్వం మాదిరి ఈ విషయంపై కేంద్రానికి వివరాలు పంపి, వారికి కూడా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చే దానిపై అనుమతి కోరాలి. అయితే, తమ చేతిలో ఏం లేదని, అంతా కేంద్రంపై నెపం నెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.