
- వాహనాలతో పోలీసులను ఢీకొట్టి పారిపోతున్రు
- తాజాగా స్మగ్లర్ బైక్‌తో ఢీకొట్టడంతో తెగిపోయిన కానిస్టేబుల్ కాలు
- ఈ వారంలోనే రెండు ఘటనలు
- మూడేళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 233 కేసులు...
- రూ.84కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత
- గంజాయి రవాణా కట్టడిపై మరింత ఫోకస్ పెట్టాల్సిందే..
భద్రాచలం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గంజాయి స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుగా వస్తున్న పోలీసులను వాహనాలతో ఢీకొట్టి మరి పారిపోతున్నారు. నాలుగు రాష్ట్రాల కూడలి భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణా కట్టడికి ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
వారంలోనే రెండు ఘటనలు..
వారం రోజుల కింద బైక్‌పై స్మగ్లర్లు వస్తున్నారనే సమాచారంతో భద్రాచలంలోని తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు బారికేడ్లను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. వేగంగా వస్తున్న స్మగ్లర్ బైక్‌ను కానిస్టేబుల్ఆపేందుకు ప్రయత్నించగా స్మగ్లర్ బైక్‌తో అతడిని, బారికేడ్స్‌ను ఢీకొట్టి పారిపోయాడు. వెంటనే భద్రాచలం సీఐ రమేశ్ తన సిబ్బందితో బైక్‌ను ఛేజ్చేశాడు.. కానీ స్మగ్లర్లు పాల్వంచ సమీపంలో వాహనాన్ని, గంజాయిని వదిలేసి పారిపోయారు.
ఈ ఘటనలో కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఇదే తరహాలో ఆదివారం మరో ఘటన జరిగింది. ఉదయం స్మగ్లర్లను ఆపేందుకు ప్రయత్నించిన పోలీసుల పైకి బైక్‌ను తీసుకొచ్చారు. కానిస్టేబుల్ యోగీంద్రచారిని బైక్‌తో బలంగా ఢీ కొట్టారు. దీంతో కానిస్టేబుల్ కాలు విరిగిపోయింది. అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. ఇటీవల ఎక్కువయ్యాయి. ఒకేచోట వారం రోజుల్లోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసు వర్గాల్లో కలకలం మొదలైంది. స్పీడ్ బైకులతో వచ్చే స్మగ్లర్లను అడ్డుకునేందుకు పోలీసులకు తలనొప్పిగా మారింది.
స్పీడ్బైక్లపైనే ఎక్కువ..
గతంలో కార్లు, లారీలు, బస్సుల్లో వివిధ రూపాల్లో స్మగ్లర్లు గంజాయిని అక్రమంగా రవాణా చేసేవారు. సరిహద్దున ఉన్న ఒడిశాలోని సీలేరు పరివాహక ప్రాంతంలో సాగు చేసిన గంజాయిని తరలించాలంటే రాజమార్గం భద్రాచలమే. ఇక్కడ పోలీసులు గట్టి నిఘాను పెట్టారు. ఆబ్కారీ పోలీసులు కూడా నిరంతరం దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీడ్బైక్లపై అక్రమ రవాణాకు స్మగ్లర్లు తెరలేపారు. యువతకు గంజాయి మత్తును రుచి చూపించి వారితో బైక్‌ల ద్వారా రవాణా ప్రారంభించారు. 20 నుంచి 30 ఏళ్ల లోపు యువకులు స్పీడ్ బైక్‌లపై పోలీసులకు దొరకకుండా తీసుకెళ్తున్నారు. పోలీసులను సైతం ఢీకొడుతున్నారు. స్మగ్లర్లను కట్టడి చేసేందుకు పోలీసులు మరింత ఫోకస్ పెట్టాల్సి ఉంది.
మూడేండ్లలో రూ.84 కోట్ల విలువైన గంజాయి పట్టివేత..
మూడేళ్ల కాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 233 కేసులు ద్వారా రూ.84కోట్ల విలువ చేసే 33,400 కిలోల గంజాయి పట్టుబడింది. కేసులు ఫైనల్ అయిన సమయంలో 10,305 కిలోల గంజాయిని ఈ ఏడాది దహనం చేశారు. ఇంకా 1,727 కిలోల గంజాయి దహనానికి సిద్ధంగా ఉంది. కాగా, కేసులు పూర్తి కాకుండా వివిధ స్టేషన్లలో ఇంతకు మూడింతల గంజాయి మూలుగుతోంది.