పోలీసు శాఖకు అవినీతి మరక .. ఏడాదిలో నలుగురు ఏసీబీ వలలో

పోలీసు శాఖకు అవినీతి మరక .. ఏడాదిలో నలుగురు ఏసీబీ వలలో
  • సెటిల్మెంట్లు.. ఇసుక దందాలు
  • ఏ పని కోసం వచ్చినా వసూళ్లు 
  •  అవినీతి ఆఫీసర్లపై ఎస్పీ ఫోకస్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో పోలీసు అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. మట్టి, ఇసుక,భూ దందాలకు పాల్పడుతూ .. ఇష్టారాజ్యంగా సివిల్ సెటిల్ మెంట్లు చేస్తున్నారు. వరుసగా పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కుతున్నా దందాలు ఆగడంలేదు. దీంతో భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసు బాస్ లు అవినీతి ఆఫీసర్లపై ఫోకస్​పెట్టారు. అక్రమ దందాలు, సెటిల్​మెంట్లను నిలువరించేందుకు కఠినచర్యలకు సిద్ధమవుతున్నారు.  ఏడాదికాలంలో జిల్లాకు చెందిన ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్​ఐలు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికారు. భద్రాచలం ఎస్​ఐ శంకర్​, కానిస్టేబుల్​ నవీన్​, పాల్వంచ టౌన్​ ఎస్​ఐ బాణాల రాము, భద్రాచలం సీఐ బరపాటి రమేశ్, అతని గన్ మాన్​, మణుగూరు సీఐ సతీశ్ ఏసీబీకి చిక్కారు. కొంతమంది అధికారుల అవినీతి కారణంగా మొత్తం పోలీస్ శాఖ ప్రతిష్టకే దెబ్బ తగిలింది. 

ఎవరైనా పని పడి పోలీసుస్టేషన్ కు వెళ్తే ఏదో పేరుమీద వసూళ్లకు పాల్పడుతున్నారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి డ్రంక్​ అండ్​ డ్రైవ్​ నిర్వహించిన పోలీసులు వాహనదారుల నుంచి రూ. వెయ్యి నుంచి రూ. 1500 వరకు వసూలు చేశారు. ఈ డబ్బులు పోలీసులే స్వాహా చేశారు. కోర్టులో ఫైన్​ కట్టాలంటూ సదరు వాహనదారులకు నోటీసులు రావడంతో వారు లబోదిబో మన్నారు. కొందరు పోలీసులకు గంజాయి అక్రమ రవాణాతోనూ సంబంధాలున్నట్టు ఆరోపణలున్నాయి.

 బూర్గంపహడ్​ పీఎస్​లో సీజ్​చేసిన గంజాయి మాయమైన ఘటనలో ఒక పోలీస్ అధికారి, సిబ్బంది ప్రమేక్ష్మీం ఉందని తెలుస్తోంది. ఇల్లెందులో వడదెబ్బతో చనిపోయిన ఓ వ్యాపారి ఇంటిని తప్పుడు డాక్యుమెంట్లతో ఓ వ్యక్తి ఆక్రమించుకోగా.. సీఐ కబ్జాదారుడికే మద్దతు ఇవ్వడం చర్చానీయాంశమైంది. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారాయని బాధితులు ఆరోపిస్తున్నారు. అశ్వారావుపేట పోలీస్​ స్టేషన్​లో పంపకాల్లో తేడాలు, వివిధ ఆరోపణల నేపధ్యంలో ఎస్​ఐ సూసైడ్​ చేసుకున్నాడు. ఇక్కడ పేకాట శిబిరాలనుంచి భారీగా మామూళ్లు ముడ్తున్నాయని ఆరోపణలున్నాయి. భద్రాచలం, బూర్గంపహడ్​, దుమ్ముగూడెం, మణుగూరు, చర్ల, అశ్వాపురం, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ టౌన్​, పాల్వంచ రూరల్ పోలీస్​ స్టేషన్లకు ఇసుక, మట్టి అక్రమ రవాణాదారుల నుంచి ముడుపులు అందుతున్నాయి.

 కొన్ని పోలీసు స్టేషన్లు సివిల్ సెటిల్​మెంట్లకు అడ్డాగా మారాయి. సెటిల్ మెంట్లలో భాగంగానే రూ. లక్ష లంచం తీసుకుంటూ ఇటీవల మణుగూరు సీఐ ఏసీబీకి చిక్కారు. అవినీతి ఆరోపణలు వచ్చిన కొందరు మహిళా ఎస్​ఐలను క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బదిలీ చేయగా.. కొందరిని వీఆర్​కు పంపారు. స్పెషల్​బ్రాంచ్​ పోలీసుల మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఏ పని కావాలన్నా రూ. 500నుంచి రూ. 5వేల వరకు వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు. మంచి పోస్టింగులకోసం రూ. 3 లక్షల నుంచి రూ. 6లక్షలు ఖర్చు చేస్తున్నామని, పెట్టిన డబ్బులు వసూలు చేసుకోవాలంటే వసూళ్లు తప్పవని కొందరు అధికారులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు 

అధికారులు ఏ స్థాయిలో ఉన్నా  అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. కొందరు సీఐలు, ఎస్​ఐలు ఏసీబీకి పట్టుబడడం విచారకరం. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇటీవల కొందరిని ట్రాన్స్​ఫర్​ చేయగా.. కొందరిని హెడ్​క్వార్టర్​కు ఎటాచ్​ చేశాం. ప్రతి నెలా క్రైం రివ్యూ మీటింగ్​లో అవినీతి అంశంపై హెచ్చరిస్తున్నాం. కొందరు చేసిన తప్పులకు పోలీస్​ శాఖకే మరక పడడం సహించరానిది. 

 బి. రోహిత్​ రాజు, ఎస్పీ, భద్రాద్రికొత్తగూడెం