12 పంచాయతీల్లో ఎన్నికలపై సందిగ్ధత

12 పంచాయతీల్లో ఎన్నికలపై సందిగ్ధత
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో481 జీపీలకు 479 జీపీల్లో ఎన్నికల ఏర్పాట్లు
  • భద్రాచలం, సారపాకతోపాటు మరో10 జీపీల్లో ఎలక్షన్​పై రాని క్లారిటీ 
  • కొత్త కార్పొరేషన్, మున్సిపాలిటీలో కలిసే గ్రామాలపై రిలీజ్​ కాని గెజిట్​
  • ప్రస్తుతానికి ఆ గ్రామాల్లోనూ ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ఆఫీసర్లు సన్నద్ధం అవుతున్నారు. త్వరలో రిజర్వేషన్లు ఖరారు కానుండడంతో ఏ క్షణంలో షెడ్యూల్​ వచ్చినా సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  కాగా జిల్లాలోని సారపాక, భద్రాచలం పంచాయతీలతోపాటు అశ్వారావుపేట మున్సిపాలిటీగా మారడంతో అశ్వారావుపేట, పేరాయిగూడెం, గుర్రాల చెరువు పంచాయతీల్లో ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. సుజాతనగర్​లోని ఏడు గ్రామపంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయబోయే కొత్తగూడెం కార్పొరేషన్​లో కలిసే అవకాశాలున్నాయి. వీటిపై కూడా పంచాయతీల్లో కూడా ఎన్నికలు జరిగే అవకాశం లేదు. 

479 గ్రామాల్లో ఏర్పాట్లు 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 481 పంచాయతీలకు గానూ479 గ్రామపంచాయతీల్లో4,232 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 4,264పోలింగ్​ కేంద్రాలను ఆఫీసర్లు గుర్తించారు. 6,33,947 మంది ఓటర్లు నమోదయ్యారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను సెలెక్ట్​ చేసింది. జిల్లా పంచాయతీ ఆఫీస్​కు ఎన్నికలకు సంబంధించిన హ్యాండ్​ బుక్స్​ కూడా వచ్చేశాయి. 

పోలింగ్​ సిబ్బంది నియామకంపై ఆఫీసర్లు ఫోకస్​ పెట్టారు. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ రెండు దశల్లోనే నిర్వహించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే సమాచారంతో అందుకు అవసరమైన ఏర్పాట్లలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. 

ఇక్కడ ఎన్నికలు ఉన్నట్టా.. లేనట్టా..? 

భద్రాచలం గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఆ పంచాయతీల్లో ఏర్పాట్లను పక్కన పెట్టారు. ఓటర్ల వివరాలను మాత్రం ప్రకటించారు. మరో వైపు అశ్వారావుపేటను మున్సిపాలిటీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి జీవో జారీ చేసింది. మున్సిపాలిటీగా మారడంతో మండలంలోని అశ్వారావుపేటతో పాటు పేరాయిగూడెం, గుర్రాల చెరువు గ్రామపంచాయతీలు అందులో భాగమయ్యాయి. కానీ గెజిట్​ రిలీజ్​ కాలేదు. దీంతో ఆయా పంచాయతీల్లో ఎన్నికలపై క్లారిటీ రావాల్సి ఉంది.

 కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్​ మండలంలోని సుజాతనగర్, నిమ్మలగూడెం, నాయకుల గూడెం, మంగపేట, లక్ష్మీదేవిపల్లి, నర్సింహసాగర్, కొమిటిపల్లి, ​ గ్రామపంచాయతీలను కలుపుతూ కొత్తగా కొత్తగూడెం కార్పొరేషన్​ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కానీ కార్పొరేషన్​ ఏర్పాటుపై ఇప్పటి వరకు ఎటువంటి గెజిట్​రిలీజ్​కాలేదు. దీంతో ఆయా పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణ ఉంటదా? లేదా? అనే చర్చ అటు ఆఫీసర్లతో పాటు ఇటు ఆయా పంచాయతీల్లో కొనసాగుతోంది.

ఆ గ్రామాలపై ఎటువంటి ఆదేశాలు రాలే.. 

అశ్వారావుపేటలోని మూడు గ్రామపంచాయతీలు, సుజాతనగర్​ మండలంలోని ఏడు పంచాయతీల విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి తమకు ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. సారపాక, భద్రాచలం గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. జిల్లాలోని 481 గ్రామ పంచాయతీలకు గానూ 479 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. 
- చంద్రమౌళి, జిల్లా గ్రామపంచాయతీ ఆఫీసర్​, భద్రాద్రికొత్తగూడెం