
- డబ్బులిచ్చారనే ఆరోపణలు
- పీసా గ్రామసభలో గిరిజనేతరులతో ఓటింగ్
- భద్రాద్రి జిల్లా గుండాలలో ఘటన
గుండాల(భద్రాద్రికొత్తగూడెం), వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో సోమవారం నిర్వహించిన పీసా గ్రామ సభలో మెజారిటీ మహిళలు తమకు మద్యం షాపు కావాలని చేతులెత్తి ఆమోదం తెలిపారు. అయితే..గిరిజనులు హాజరు కావాల్సిన ఈ సభకు డబ్బుల్చి గిరిజనేతరులను తరలించారని, వారి ఆమోదంతోనే మద్యం షాపును ఓకే చేయించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం గుండాల జీపీలో సర్పంచ్ కోరం సీతారాములు అధ్యక్షతన పీసా గ్రామసభ నిర్వహించారు. దీనికి గుండాల, కోనవారిగూడెం, పోతిరెడ్డిగూడెం నుంచి తప్పనిసరిగా ఆదివాసీలే హాజరుకావాలన్న నిబంధన ఉంది. కానీ, ఈ మూడు గ్రామాల నుంచి గిరిజనులు తక్కువగా వచ్చారు.
మండల కేంద్రంలో మద్యం షాపు పెట్టాలా వద్దా అనే అంశంపై ఓటింగ్పెట్టాల్సి ఉండగా కొందరు వైన్స్ నిర్వాహకులు గిరిజనేతరులను, ఇతర కులాల వారిని డబ్బులిచ్చి పిలిపించారని సమాచారం. మద్యం షాపు కావాలనుకునే వారు చేతులెత్తాలని కోరగా 130 మందిలో 122 మంది చేతులెత్త ఆమోదాన్ని తెలిపారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన సర్పంచ్, పెసా కమిటీ అధ్యక్షుడు సీతారాములు ‘ఆడవారు మద్యం షాపులు వద్దని చెబుతారు..మీరంతా కావాలని అడుగుతున్నారేమిటి’ అని ప్రశ్నించగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో తీర్మానం రాశారు. పెంటన్న, నరసింహారావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.