- భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు
సుజాతనగర్, వెలుగు : బాలకార్మిక వ్యవస్థను నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ 10 కార్యక్రమం ఈనెల 1 నుంచి 31 వరకు జిల్లాలో పక్కా ప్రణాళికతో అమలు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆఫీసులో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతీ సబ్ డివిజన్ పరిధిలో ఒక ఎస్సై, నలుగురు సిబ్బంది కలిసి టీమ్‌గా ఉంటుందని చెప్పారు.
పోలీసు శాఖతో పాటు ఇతర శాఖల అధికారులతో సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఐదు ప్రత్యేక బృందాలు బాలకార్మికులను గుర్తించడానికి దాడులు నిర్వహిస్తాయని చెప్పారు. ఎవరైనా బాలకార్మికులను గుర్తిస్తే 1098కు గానీ, డయల్ 100కు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, విద్యాశాఖ అధికారి అన్నామని, లేబర్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీకి దళిత సంఘాల వినతి
అశ్వారావుపేట : అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి కారకులైనవారిపై విచారణ జరిపి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పులా రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కొత్తగూడెం లోని ఎస్పీ రోహిత్ రాజును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.