భద్రాద్రికొత్తగూడెం జిల్లా నుంచి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు నలుగురే :ఎస్పీ రోహిత్​రాజ్​

భద్రాద్రికొత్తగూడెం జిల్లా నుంచి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు నలుగురే :ఎస్పీ రోహిత్​రాజ్​

భద్రాచలం, వెలుగు :   భద్రాద్రికొత్తగూడెం నుంచి 2024 లో మావోయిస్టు పార్టీలో ఉన్న 36 మంది లొంగిపోయారని, ఇక నలుగురు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని ఎస్పీ రోహిత్​రాజ్​ తెలిపారు.  చర్ల పోలీస్​స్టేషన్​లో శనివారం ఆయన సమక్షంలో ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని సుక్మా జిల్లా ఎర్రపల్లి గ్రామానికి చెందిన 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు, వారి కుటుంబ సభ్యులతో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

 వారితో కలిసి సహపంక్తి భోజనం చేసి మాట్లాడారు. గతంలో జిల్లా నుంచి పలువురు మావోయిస్టు పార్టీలో పనిచేశారని, వారందరినీ జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చామని, ఇక మిగిలిన నలుగురిని తీసుకురావాలని తన సిబ్బందికి సూచించారు. తెలంగాణ నుంచి మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న చంద్రన్న, ఆజాద్, దామోదర్, వెంకటేశ్, సుధాకర్, మధు వెంటనే ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసి, ఆదివాసీల అభివృద్ధిలో తమతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ సరెండర్ పాలసీ చాలా బాగుందని, అందుకే మావోయిస్టులు ఛత్తీస్​గఢ్​ నుంచి వచ్చి ఇక్కడ లొంగిపోతున్నారని తెలిపారు. ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ పంకజ్​ పరితోశ్, ఏఎస్పీ విక్రాంత్​కుమార్​ సింగ్, సీఆర్​పీఎఫ్​ కమాండెంట్​రాజ్​కుమార్​, సీఐలు రాజువర్మ, అశోక్​, రవికుమార్​ తదితరులు పాల్గొన్నారు.