రేషన్​ కోసం ..10, 12 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే

  •     ఏడాదిన్నర కిందటే కొత్త షాపుల స్రపోజల్​
  •     ఇప్పటికీ స్పందించని ఆఫీసర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్త రేషన్​షాపుల ఏర్పాటు చేయకపోవడంతో పేదలు అవస్థలు పడుతున్నారు. పనులన్నీ మానుకుని 10, 12 కిలోమీటర్లు వెళ్లి రేషన్​ తెచ్చుకోవాల్సివస్తోంది. రేషన్​ డీలర్ల ఖాళీలను భర్తీ చేయాలని.. గ్రామాల్లో కొత్తగా రేషన్​ షాపులను ఏర్పాటు చేయాలని కిందిస్థాయి నుంచి ఏడాదిన్నర కిందటే ప్రతిపాదనలు వచ్చినా ఇంతవరకు జిల్లా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీనివల్ల పేదలు వ్యయ ప్రయాసలు పడాల్సివస్తోంది.

పనులు మానుకుని రేషన్​ కోసం.. 

జిల్లాలో మండలాలు, గ్రామపంచాయతీల పునర్విభజన అనంతరం రేషన్​ షాప్ ల రేషనలైజేషన్​ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పంచాయతీల్లో షాపులు లేకపోవడం.. ఓకే షాపు పరిధిలో లెక్కకు మించి కార్డులు ఉండడంతో ఎదురవుతున్న ఇబ్బందులపై చాలా కాలం నుంచి ఫిర్యాదుల వస్తున్నాయి. కొన్ని చోట్ల వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న డీలర్లను భర్తీ చేయకపోడంవల్ల ఒకే డీలర్​ రెండు మూడు షాపులకు ఇన్​చార్జీగా వ్యవహరిస్తున్నారు. 

దీంతో వారు ప్రతిరోజు షాపు తెరవడంలేదు. ఆ షాపుల్లో రేషన్​ఎప్పుడిస్తారో తెలియక పేదలు పని మానేసి రోజూ రేషన్​ దుకాణాల చుట్టు తిరగాల్సి వస్తోంది. దీంతో లబ్ధిదారులందరికీ అందుబాటులో ఉండేలా రేషన్​షాపులను ఏర్పాటు చేయాలని సర్కారు భావించింది. 

109 షాపులకు ప్రపోజల్స్​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2,79,190 కుటుంబాలున్నాయి. 2,93,316 రేషన్ జిల్లావ్యాప్తంగా ఇప్పుడు 443 రేషన్​షాపులున్నాయి. ప్రతి నెలా దాదాపు 5375.83 మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని ఈ షాప్​ల ద్వారా సప్లై చేస్తున్నారు. వివిధ కారణాలతో 27 షాపులకు చాలాకాలంగా రెగ్యులర్​ డీలర్లు లేరు. వీటి బాధ్యతలను దగ్గరలో ఉన్న డీలర్లకు అప్పగించారు. దీంతోపాటు జిల్లాలో కార్డుల సంఖ్య, అవసరాల దృష్ట్యా కొత్తగా 109షాపులు ఏర్పాటు చేయాల్సి ఉందని సివిల్​ సప్లై ఆఫీసర్లు ప్రపోజల్స్​ తయారు చేశారు. కొత్త షాపులను ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న చోట్ల వెంటనే డీలర్లను నియమించాలని కలెక్టర్​ ఇదివరకే అధికారులను ఆదేశించినా రకరకాల సాకులతో ఆ దిశగా చర్యల తీసుకోవడంలేదు.

 జిల్లాలోని రాంచంద్రాపురం, కురకడపాడు ప్రాంతానికి చెందిన లబ్ధిదారులు దాదాపు 10కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్​ కొత్తగూడెం వెళ్లి రేషన్​ తెచ్చుకుంటున్నారు. లింగగూడెం ప్రజలు 9 కిలోమీటర్ల దూరంలోని శంభునిగూడెం వెళ్తున్నారు. ఎర్రంపాడు, భట్టుగూడెం, బత్తినపల్లి, కమలాపురం ప్రజలుదాదాపు 8కిలోమీటర్ల దూరంలోని పెద్దముసలేరుకు వెళ్లి రేషన్​ తెచ్చుకుంటున్నారు. చర్ల మండలంలోని కుర్నపల్లి ప్రజలు 7కిలోమీటర్ల దూరంలోని ఆర్​ కొత్తగూడెం

 ముల్కలపల్లి మండలం మంగళగుట్ట, సుందర్​నగర్​, చండ్రుగొండ మండలంలోని మహ్మద్​ నగర్​, సీతాయి గూడెం, గుండాల మండలంలోని కొడవటంచ గ్రామస్తులు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలోని దుఖాణాల నుంచి రేషన్​ తెచ్చుకుంటున్నారు. కొందరు డీలర్లు నెలలో వారం రోజులు మాత్రమే షాపులు ఓపెన్​ చేస్తున్నారు. మిగతా రోజుల్లో బంద్​ చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నా సివిల్​ సప్లై, రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. 

చక్కెర ఇస్తలేరు

అంత్యోదయ కార్డు ఉన్న వారికి చక్కెర ఇవ్వకుండా డీలర్లు ఎగ్గొడుతున్నారు. ప్రతి కార్డుకు కిలో చక్కెర ఇవ్వాల్సిఉండగా డీలర్లు చేతులెత్తేస్తున్నారు. చక్కెర లిఫ్ట్​ చేసేందుకు డీలర్లు ఇంట్రెస్ట్​ చూపడంలేదు. లబ్ధిదారులు అడిగితే చక్కెర అలాట్​మెంట్​కాలేదని చెప్తున్నారు. జిల్లాలో 18,801అంత్యోదయ కార్డులున్నాయి. మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి సివిల్​ సప్లయిస్​ రివ్యూలో ఇచ్చిన ఆదేశాల మేరకుజిల్లాలో బినామీ పేర్ల మీద నడుస్తున్న షాపులపైనా అధికారులు నజర్​ పెడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్​ కొత్త ​షాపుల ఏర్పాటుపై చొరవ చూపాలని పేదలు కోరుతున్నారు. 

ప్రతిపాదనలు పంపాం 

కొత్త రేషన్​ షాపులతో పాటు ఖాళీగా ఉన్న రేషన్​ షాపుల వివరాలను ఆర్డీఓకు పంపాం. డీలర్లను నియమించేందుకు ఆర్డీఓ నోటిఫికేషన్​ఇవ్వాల్సిఉంటుంది. 

  రుక్మిణీ దేవి, సివిల్​ సప్లై జిల్లా అధికారి