పర్ణశాల నుంచి కిన్నెరసాని వరకు భద్రాద్రి టూరిజం టూర్

పర్ణశాల నుంచి కిన్నెరసాని వరకు భద్రాద్రి టూరిజం టూర్
  • గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో పర్యాటకులను ఆకట్టుకునేలా ప్లాన్​
  • ఆధ్యాత్మిక శోభ అలరారేలా పనులు 
  • సింగరేణి మ్యూజియం ఏర్పాటు దిశగా అడగులు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పర్ణశాల నుంచి కిన్నెరసాని వరకు టూరిజం డెవలప్​మెంట్​కు సంబంధించిన పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. జిల్లాలో ట్రైబల్, ఏకో టూరిజాన్ని డెవలప్​ చేయనుంది. ఏజెన్సీ జిల్లాగా పేరొందిన ఈ జిల్లాలో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్లాన్ ​చేస్తోంది. 

మేజర్​ వర్క్స్​ ఇక్కడే.. 

భద్రాచలం కేంద్రంగా గిరిజన మ్యూజియాన్ని ఇప్పటికే కలెక్టర్​ ఐటీడీఏ పీవో డెవలప్​ చేస్తున్నారు. గిరిజన గూడెలను తలపించేలాగుడిసెలను నిర్మించేందుకు ప్లాన్​ చేస్తున్నారు. పర్యాటకులు గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి ఆనందించేలా చర్యలు చేపట్టనున్నారు. కొమ్ము బూరలు, జంతువుల కొమ్ముల మధ్య ఆకట్టుకునే నెమలి ఈకలతో రూపొందించిన తలపాగాలు రెడీ చేస్తున్నారు. 


 పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్ట్​ అందాలు ఆధ్యంతం ఆకట్టుకుంటాయి. చుట్టూ గుట్టలు, ఆకట్టుకునే పలు రకాల వృక్షాలు అలరిస్తాయి. ప్రాజెక్ట్​ లోని నీళ్ల మధ్యలో దట్టమైన అడవితో కూడిన ప్లేస్​లో కాటేజీల నిర్మాణంతో పాటు ఫంక్షన్స్​ చేసుకునేలా టూరిజంను డెవలప్​ చేయనున్నారు. ఈ ద్వీపానికి కిన్నెరసానిలో బోటు ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్​లో ఆకట్టుకునే అద్దాల మేడ పనులు పూర్తి కావొస్తున్నాయి. అద్దాల మేడకు వెళ్లే దారిలోని కుహు, కుహు  ప్రాంతంలో పక్షుల కిలకిలరావాలు ఆకట్టుకుంటాయి. కిన్నెరసాని ప్రాజెక్ట్​ గేట్లను ఓపెన్​ చేసే టైంలో పరవళ్లు తొక్కుతూ గోదారి  హోయలు కనువిందు చేస్తాయి. ప్రాజెక్ట్​లోకి ఎంటర్​ అయ్యేటప్పుడు డీర్​ పార్క్​ ఆకట్టుకుంటుంది. ఇక్కడే ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 

దక్షిణ అయోధ్యగా ప్రసిద్ది చెందిన భద్రాచలంలోని సీతారామ చంద్రస్వామి టెంపుల్​కు నిత్యం వేలాదిగా భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఇప్పటికే ప్రసాద్​ స్కీం కింద టెంపుల్​ డెవలప్​మెంట్​వర్క్స్​ కొనసాగుతున్నాయి. వన వాసంలో భాగంగా సీతారాములు నివసించిన పర్ణశాల అటు భక్తిత పాటు ఇటు చరిత్రకు అద్దం పడుతోంది. అక్కడికి సమీపంలోనే లక్ష్మణ గుట్ట ఉంటుంది. గోదావరి అవతలి వైపు మణుగూరుకు సమీపంలో రథం గుట్ట ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతానికి సమీపంలోనే ఆకట్టుకునే వెన్నెల జలపాతం ఉంది. భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే దారిలో చిన్న ఆరుణాచలంలో ఆధ్యాత్యిక శోభ అలరారుతోంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన అరుణాచలంలో మాదిరిగాఈ అష్ట లింగాలుంటాయి. పాల్వంచ నుంచి భద్రాచలం వెళ్లే దారిలో పెద్దమ్మ తల్లి టెంపుల్​, బూర్గంపహడ్​ సమీపంలోని కాకతీయుల కాలం నాటి మోతే శివాలయం భక్తులకు ఆధ్యాత్మిక శోభను అందించనున్నాయి. 

పర్యాటకుల కోసం హోటల్​..

పర్యాటకులను ఆకట్టుకునే క్రమంలో కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, భద్రాచలం వెళ్లేదారిలోని సెంటర్​ పాయింట్​గా ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఇల్లెందు క్రాస్​ రోడ్డులో హరిత హోటల్​ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ హోటల్​ లో దాదాపు 40కి పైగా రూమ్​లు ఉన్నాయి. రెస్టారెంట్​ను అందుబాటులోకి తేనున్నారు. 

సింగరేణి మ్యూజియం..

సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లైన ఇల్లెందు, హెడ్డాఫీస్​ ఉన్న కొత్తగూడెంలో ఏదో ఒక చోట సింగరేణి మ్యూజియం ఏర్పాటు చేయాలని యాజమాన్యం ఆలోచిస్తోంది. సింగరేణిలో అండర్​ గ్రౌండ్​ మైన్స్, ఓపెన్​కాస్ట్​ ప్రాజెక్ట్స్​ ఎలా ఉంటాయి,  భూగర్భంలో బొగ్గు తవ్వకంలో చేపట్టే మిషనరీ, తదితర వాటిని మ్యూజియంలో ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. బ్రిటీష్​ పాలకుల హయాంలో బొగ్గు తవ్వకాలు, ఆనాడు బొగ్గు ఉత్పత్తిలో కార్మికుల కష్టాలను కళ్ల ముందు కనిపించేలా మ్యూజియంను ఏర్పాటు చేస్తారు.