భద్రాచలం, వెలుగు : పుష్యమి నక్షత్రం సందర్భంగా భద్రాద్రి రాముడికి పట్టాభిషేకం సోమవారం కన్నుల పండువగా జరిగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ వేడుక వేదోక్తంగా సాగింది. ముందుగా గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేసి ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరణతో ముత్తంగి సేవ నిర్వహించారు. లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామిలకు కూడా ముత్తంగి సేవ జరిగింది. కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణ వేడుక ప్రారంభించగా 35 జంటలు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నాయి.
కల్యాణం అనంతరం భద్రాద్రి రాముని పట్టాభిషేక వేడుక షురూ అయ్యింది. సమస్త నదీ, సముద్ర జలాలను తీసుకొచ్చి కలశాల్లో ఆవాహన చేశారు. వేదికతో పాటు పట్టాభిషేకంలో పాల్గొన్న 14 జంటలపైనా జలాలు చల్లి సంప్రోక్షణ చేశారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య భక్తరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించారు. ప్రత్యేక హారతులు ఇచ్చారు. చామరలు, వెండి గద, బాకు బహుకరించి చివరగా స్వామికి కిరీటం అలంకరించడం ద్వారా పట్టాభిషేకం కార్యక్రమం ఘనంగా జరిగింది.
పట్టాభిరామయ్యను తిలకించి భక్తకోటి పులకించింది. సాయంత్రం దర్బారు సేవ చేశారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళం పట్టణంలోని భూపాలరావు స్ట్రీట్కు చెందిన పరిణమ్ రామారావు, కృష్ణవేణి దంపతులు చిత్రకూట మండపంలో స్వామి వేడుకల నిర్వహణకు అవసరమయ్యే మైక్ సెట్ కోసం రూ.1.55లక్షల విరాళాన్ని ఈవో రమాదేవికి అందజేశారు.