వామనావతారంలో భద్రాద్రి రాముడు

వామనావతారంలో భద్రాద్రి రాముడు

భద్రాచలం, వెలుగు : వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం భద్రాద్రి రామయ్య వామనావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తొలుత రామపాదుకలకు భద్రుని మండపంలో పంచామృతాలతో అభిషేకం చేసి, గర్భగుడిలో శ్రీ సీతారామచంద్రస్వామి మూలవరులకు సువర్ణ తులసీ దళ అర్చన నిర్వహించారు. అనంతరం సీతారాముల ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి వామనరూపంలో అలంకరించారు.

విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, వేదవిన్నపాలు జరిగాయి. నాళాయర దివ్య ప్రబంధం పారాయణం అయ్యాక స్వామి వారిని ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవ నిర్వహించారు. మరోవైపు ధనుర్మాసోత్సవం సందర్భంగా ఆండాళ్లమ్మ వారికి తిరుప్పావై సేవాకాలం నిర్వహించారు. గర్భగుడిలో స్వామివారికి తిరుప్పావై  పాశురం విన్నవించారు.