బలరామావతారంలో భద్రాద్రి రామయ్య

బలరామావతారంలో భద్రాద్రి రామయ్య

భద్రాచలం, వెలుగు : ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం సీతారామచంద్రస్వామి భక్తులకు బలరామావతారంలో దర్శనం ఇచ్చారు. సుప్రభాత సేవ అనంతరం ఉత్సవమూర్తులను బేడా మండపంలో బలరామావతారంలో అలంకరించి విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత చతుర్వేద విన్నపాలు, నాళాయర దివ్యప్రబంధ పారాయణం జరిగాయి. బలరామావతారంలో స్వామిని ఊరేగింపుగా మిథిలా ప్రాంగణంలోని వేదికపైకి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు దర్శనం కల్పించారు.

మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామికి మంగళనీరాజనాలు పలికారు. పల్లకిలో ఊరేగించి రామయ్యకు తిరువీధి సేవను నిర్వహించారు. కోలాటాలు ఆడుతూ మహిళా భక్తులు పురవీధుల్లో స్వామికి స్వాగతం పలికారు. తాతగుడి సెంటర్​లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ తిరువీధి సేవ వైభవంగా సాగింది. అక్కడ పూజలందుకొని స్వామి తిరిగి ఆలయానికి వచ్చారు.