దశావతారాల్లో దర్శనం ఇవ్వనున్న భద్రాద్రి రామయ్య

  • జనవరి 1న తెప్పోత్సవం...2న ఉత్తరద్వార దర్శనం
  • జనవరి 2వరకు నిత్య కల్యాణాలు రద్ద

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి పగటిపూట రోజుకో అవతారం చొప్పున దశావతారాల్లో దర్శనం ఇవ్వనున్నారు.  జనవరి 1న తెప్పోత్సవం, 2న వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారదర్శనం తర్వాత స్వామి రాత్రి వేళల్లో వివిధ శాఖలవారి మండపాల్లో దర్శనం ఇస్తారు. వీటినే రాపత్​ ఉత్సవాలు అంటారు. జనవరి 13 నుంచి 15వరకు విలాసోత్సవాలు జరుగుతాయి. జనవరి 19న విశ్వరూప సేవ ఉంటుంది. ఉత్సవాలను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు భద్రాచలం వస్తారు. భక్తుల కోసం కలెక్టర్​అనుదీప్​ నేతృత్వంలో దేవస్థానం ఈవో శివాజీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాగతద్వారాలతో పాటు తాత్కాలిక వసతి, డ్రెస్ ఛేంజింగ్​ రూంలు, ప్రసాదాలు, అందరికీ దర్శనం భాగ్యం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికత సంతరించుకునేలా ఆలయ గోడలపై రామాయణ చిత్రాలను గీయిస్తున్నారు. జనవరి 1న గోదావరిలో తెప్పోత్సవం కోసం హంస వాహనాన్ని రెడీ చేశారు. నదిలో నీరు తక్కువగా ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రయల్​రన్​ నిర్వహించారు. వైకుంఠ ద్వారం ఎదురుగా పగల్​పత్​ ఉత్సవాల్లో స్వామివారి అవతారాలను భక్తులు దర్శించుకునేలా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.   ఈ ఉత్సవాల నేపథ్యంలో శుక్రవారం నుంచి జనవరి 2 వరకు శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిత్య కల్యాణాలు రద్దు చేశారు. 

రాష్ట్రపతి పర్యటన.. భద్రాచలంలో ఆంక్షలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా భద్రాచలంలో ఆంక్షలు విధించారు. ఈనెల 27, 28 తేదీల్లో పట్టణంలో డ్రోన్ల సంచారాన్ని నిషేధించారు. శ్రీరామ దివ్యక్షేత్రం మొత్తం కేంద్ర బలగాలు ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. ఇప్పటికే నిఘావర్గాలు భద్రాచలానికి చేరుకున్నాయి. ఆలయం చుట్టూ ఉన్న షాపులను రెండు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు. సారపాక– భద్రాచలం రామాలయం వరకు ఉన్న మార్గం లో ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు. గోదావరి బ్రిడ్జి సమీపంలోని వైకుంఠ ఏకాదశి స్వాగత ద్వారాన్ని కూడా తొలగించారు. రోడ్డు కిరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను కూడా నరికేశారు. సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్​లో రాష్ట్రపతి బస చేస్తారు. ఇందుకోసం స్పెషల్​ ఆఫీసర్లను నియమించారు. కలెక్టర్​ అనుదీప్​, ఎస్పీ డా.వినీత్​ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐటీసీ పబ్లిక్ స్కూల్​, భద్రాచలం పొగాకు బోర్డు ఆవరణలో రెండు హెలీప్యాడ్​లను రెడీ చేశారు. భద్రాచలం టౌన్​ మొత్తాన్ని బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. లాడ్జీలు, సమీప ఇండ్లపై నిఘా ఉంచారు. కొత్త వ్యక్తుల సంచారంపై ఆరా తీస్తున్నారు. 

ఆలయం చుట్టూ ఆక్రమణల తొలగింపు

ఆలయం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మార్గాల వైపు ఉన్న 110 దుకాణాలు రోడ్డుపైకి వచ్చి ఉన్నాయి. వీటిని సీఐ నాగరాజురెడ్డి, తహసీల్దారు శ్రీనివాస్​యాదవ్, పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు తొలగించారు. ఈ సందర్భంగా షాపు యజమానులు వారితో వాగ్వాదానికి దిగారు. రాష్ట్రపతి పర్యటన కారణంగా తొలగించాల్సిందేనని వారికి నచ్చజెప్పారు.