- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
- తాము పట్టుకున్న నకిలీ లడ్డూలని ప్రకటించిన దేవస్థానం
భద్రాచలం, వెలుగు : ‘అన్నదాన సత్రం వెనుక పెంటకుప్పలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం లడ్డూలు’ అంటూ మంగళవారం సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్అయ్యాయి. ‘అంతా రామమయం.. ఆలయ అధికారుల తీరంతా అయోమయం’ అంటూ ఆ ఫొటోలకు ట్యాగ్‌లైన్ పెట్టారు. దీంతో ఇది చూసిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, శ్రీరామనవమి సందర్భంగా అన్నదాన సత్రం సమీపంలో కొందరు నకిలీ లడ్డూలను తయారు చేసి అమ్ముతున్నారన్న సమాచారంతో వాటిని దేవస్థానం అధికారులు పట్టుకున్నారు. వాటిని బయోగ్యాస్‌కు వినియోగించేందుకు పక్కన బెట్టారు. అందులో కొన్నింటిని బయట పడేయడంతో కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అవి పట్టుకున్న లడ్డూలు అంటూ దేవస్థానం ఈఈ రవీందర్వివరణ ఇవ్వాల్సి వచ్చింది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి కనీసం వాటిని నదిలో నిమజ్జనం చేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు.