భద్రాచలం, వెలుగు: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సోమవారం నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు ముందుగా ఉత్సవ మూర్తులను నరసింహ అవతారంలో అలంకరించి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ప్రాకార మండపానికి తీసుకొచ్చారు. నాళాయర దివ్యప్రబంధ, వేద, క్షేత్రమహత్యం పారాయణాలు చేశారు.
తర్వాత ఊరేగింపుగా అధ్యయన వేదిక వద్దకు, అక్కడి నుంచి గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి గ్రామ పరిక్రమణానికి బయలుదేరారు. ముదిరాజ్బజార్, రంగనాయకుల గుట్టను చుట్టి తిరిగి ప్రధాన ఆలయానికి వెళ్లారు. ఈ వేడుకల్లో ఈఓ శివాజీ పాల్గొన్నారు.