భద్రాచలం : గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం మంగళవారం ఉదయం 7 గంటలకు50 అడుగులకు చేరింది. ఈ ఏడాది గోదావరి నీటి మట్టం 50 అడుగులకు చేరడం ఇది నాలుగోసారి. జులై 16న గరిష్ఠంగా 71.3 అడుగులు, ఆగస్టు 12న 52.5, 17న 54.5 అడుగులు మార్కును గోదావరి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 51.60 అడుగులతో 13లక్షల 49 వేల 565 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పంటలు నీట మునిగాయి. భద్రాచలం-–పేరూరు మధ్య తూరుబాక, పర్ణశాల, ఆలుబాక, గంగోలు రోడ్లపై నీరు చేరింది. బూర్గంపాడు మండలం సారపాక, అశ్వాపురం మండలం రామచంద్రాపురం, నెల్లిపాక బంజర వద్ద కూడా రోడ్లు మునిగాయి. భద్రాచలం నుంచి చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రా రాష్ట్రాలకు రాకపోకలు బంద్అయ్యాయి. మూడు నెలలుగా గోదావరిలో అత్యధిక రోజులు 50 అడుగుల మేర వరద ఉండటంతో తీరప్రాంత గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు కూడా పత్తి, వరి, మిరప పంటలు మునిగిపోయాయి. 11 ఎకరాల్లో మూడుసార్లు నాటిన పత్తి పంట గోదావరి ప్రవాహంతో దెబ్బతిందని, రూ. లక్ష పెట్టుబడి కోల్పోయానని భద్రాచలానికి చెందిన మేకల వీర్రాజు కన్నీరు మున్నీరయ్యారు.
మరోసారి వరద వస్తుండటంతో పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్‌దురిశెట్టి సిద్ధం చేయిస్తున్నారు. ఇళ్లలోకి నీరు వస్తుందనే భయంతో బూర్గంపాడుతో పాటు భద్రాచలంలోని అశోక్‌నగర్ కొత్తకాలనీ, సుభాష్‌నగర్, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇళ్లలో సామాన్లు సర్దుకుంటున్నారు. వరద పెరిగితే ఏ క్షణమైనా పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్ ఆదేశించారు. భద్రాచలం-– చింతూరు, భద్రాచలం – -కూనవరం, చర్ల -– భద్రాచలం మధ్య ఆర్టీసీ సర్వీసులను రద్దు చేశారు. భూపాలపల్లి జిల్లా మేడి గడ్డ బ్యారేజ్ దగ్గర మంగళవారం రాత్రి 7 గంటలకు 10.99 లక్షల క్యూసెక్కుల వరద ఉండగా బ్యారేజ్ 85 గేట్లను తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. 16.17 టీఎంసీల కెపాసిటీ ఉండగా ఆఫీసర్లు నీటిని నిల్వ చేయకుండా ఫ్రీ ఫ్లో పాటిస్తున్నారు.