- పుష్యమి నాడు పట్టాభిషేకం
- భక్తులతో కిక్కిరిసిన భద్రగిరి
భద్రాచలం, వెలుగు : మకర సంక్రాంతి వేళ భద్రాద్రి సీతారామయ్యకు మంగళవారం రాత్రి రథోత్సవం జరిగింది. పుష్యమి నాడు బుధవారం పట్టాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తడంతో భద్రగిరి కిక్కిరిసిపోయింది. ‘జై శ్రీరామ్’ నినాదాలతో ఆలయం మార్మోగింది. విద్యుద్దీపాలతో అలంకరించిన రథానికి ముందుగా అర్చకులు విశేష పూజలు జరిపారు. అందులో సీతారాములను కూర్చోబెట్టి ప్రత్యేక హారతులు ఇచ్చారు. మాడవీధుల్లో రథాన్ని భక్తిభావంతో రామనామస్మరణ చేస్తూ ఉత్సాహంగా లాగారు. అంతకుముందు ఉదయం అభయాంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి అప్పాల, తమలపాకుల మాలలను నివేదించారు.
సంక్రాంతి నాడు సీతారాములను దర్శించుకోవడం తెలుగు ప్రజలకు ఆనవాయితీ. సాయంత్రం రాపత్సేవలో భాగంగా స్వామి ఆంధ్రా విలీన ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామానికి వెళ్లారు. పూజలందుకుని ఊరేగింపుగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య కుటుంబ సమేతంగా సీతారాములను దర్శించుకుని పూజలు చేశారు. హైదరాబాదులోని దిల్సుఖ్నగర్కు చెందిన కె.వెంకట్రాజ్ అనే భక్తుడు సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116ను విరాళంగా అందజేశారు.
పట్టాభిషిక్తుడైన రామయ్య..
పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం వేదోక్తంగా చేశారు. ముందుగా ప్రాకార మండపంలో సీతారాముల ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. హారతులు ఇచ్చారు. బేడా మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం చేశారు. కల్యాణ క్రతువు ముగిశాక శాస్త్రోక్తంగా పట్టాభిషేకం జరిగింది. వేదికను ప్రోక్షణ జలాలతో శుద్ధి చేసి భక్తరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య రామయ్యకు చామరాలు, గద, డాలు, కత్తి సమర్పించి బంగారు కిరీటాన్ని అలంకరించి పట్టాభిషేకం చేశారు.
పునర్వసు మండపంలో ‘రాపత్ సేవ’
గోదావరి తీరంలోని పునర్వసు మండపంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్సేవను బుధవారం నిర్వహించారు. దర్బారు సేవ అనంతరం ఊరేగింపుగా స్వామి గోదావరి ఒడ్డున ఉన్న పునర్వసు మండపానికి చేరుకున్నారు. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత హారతులు ఇచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవ జరిగింది.