- రంగంలోకి 525 టీమ్స్
- రైతు భరోసా కోసమే 434 టీమ్స్
- 21 నుంచి గ్రామసభలో జాబితా ప్రదర్శన
- రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల అర్హుల ఎంపికకు కసరత్తు
యాదాద్రి, వెలుగు : ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయనుండగా.. ఆయా స్కీమ్స్లకు అర్హులను గుర్తించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నాలుగు స్కీమ్స్‌లో నిజమైన అర్హుల లెక్కలు తీయడానికి ఆఫీసర్లు గురువారం నుంచి సర్వే నిర్వహించనున్నారు. మొత్తం 525 టీమ్స్ ఏర్పాటు చేయగా ఇందులో రైతుభరోసా కోసమే 434 టీమ్స్‌ను ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ హనుమంతరావు అన్ని మండలాల్లో పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారు.
2,48,536లో రైతు భరోసాకు అర్హులెందరూ..
యాదాద్రి జిల్లాలో భూ విస్తీర్ణం దాదాపు 8 లక్షల ఎకరాలకు పైబడి ఉండగా సాగుకు పనికొచ్చే భూమి 6 లక్షల ఎకరాలు ఉంది. ఈ భూమిలో సుమారుగా 4.50 లక్షల ఎకరాల్లో తోటలు సహా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. 2023 యాసంగిలో జిల్లాలోని 2,48,536 మంది రైతులకు 5,87,360 ఎకరాలకు రూ. 5 వేల చొప్పున రైతుబంధు అందించారు.
అయితే ఈ సీజన్ నుంచి పంటలు సాగు చేస్తున్న రైతులకే రైతుభరోసా అందించాలని, 2023 యాసంగి సీజన్ లబ్ధిదారుల జాబితాను ప్రామాణికంగా తీసుకొని సర్వే చేయాలని ఆదేశించింది. గురువారం నుంచి రెవెన్యూ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ సర్వే ప్రారంభించనున్నారు. ఈ సర్వేతో 2,48,536 మంది రైతుల్లో సాగు చేసే వారిని గుర్తించి రైతు భరోసా అందించనున్నారు.
ఆత్మీయ భరోసా ఎందరికి?
భూమిలేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ. 12 వేలు అందించడానికి సర్కారు రెడీ అయింది. ఇందుకు ఉపాధి హామీ స్కీమ్‌లో పని చేస్తున్న వారిని పరిగణలోకి తీసుకుంది. 2023–-24లో కనీసం 20 రోజులకు తగ్గకుండా పని చేసిన వారిలో భూమి లేని కూలీలను, కుటుంబాల వారీగా గుర్తించి భరోసా అందించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో లెక్కలు తీసిన ఆఫీసర్లు జిల్లాలో 98,709 మంది కూలీలు ఉండగా వారిలో 20 రోజులకు తగ్గకుండా 63,057 మంది పని చేశారని లెక్కలు తీశారు
16,674 కుటుంబాల్లో రేషన్‌కార్డులు ఎందరికీ..
యాదాద్రి జిల్లాలోని 17 మండలాల పరిధిలో 515 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రస్తుతం 2,16,841 రేషన్‌కార్డులు ఉండగా 6,60,054 మంది లబ్దిదారులున్నారు. కాగా డిసెంబర్ 2016 నుంచి గతేడాది 16,674 మంది రేషన్ కార్డుల కోసం అప్లయ్ చేసుకున్నారు. మ్యూటేషన్ల కోసం 1282 మంది అప్లయ్ చేసుకున్నారు. కార్డుల్లో లబ్దిదారులుగా తమను చేర్చాలని 26,941 అప్లయ్ చేసుకున్నారు.
నేటి నుంచే వడపోత
ఆయా స్కీమ్స్ కోసం అప్లయ్ చేసుకున్న వారి సంఖ్యలో అర్హులెవరో గురువారం నుంచి ఆఫీసర్లు వడపోత చేయనున్నారు. లీస్ట్‌ను ఈ నెల 21 నుంచి నిర్వహించే గ్రామసభల్లో ప్రదర్శిస్తారు. 26న వారిని అర్హులుగా ప్రకటించనున్నారు.
ఇందిరమ్మ ఇండ్లు ఎందరికి
సొంతిండ్లు లేని వారికి, పూరి గుడిసెలు, రేకుల ఇండ్లలో ఉంటున్న వారికి ఇందిరమ్మ స్కీంలో ఇండ్లు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజాపాలన అప్లికేషన్లలో 2,01,977 కుటుంబాలు తమకు ఇండ్లు లేవని పేర్కొన్నారు. ఇటీవల 1.96 లక్షల కుటుంబాల అప్లికేషన్లు చెక్ చేసి నమోదు చేశారు. వీరిలో ఇప్పటికే 7 వేల మందికి పైగా తమకు ఇండ్లున్నాయని, అనుకోకుండా అప్లయ్ చేశామంటూ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.
జిల్లాలో మొత్తంగా 1.53 లక్షల కుటుంబాలకు సొంతిండ్లు ఉన్నాయని, 41, 203 కుటుంబాలు అద్దె ఇండ్లలో ఉన్నట్టుగా ప్రాథమికంగా తేలింది. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం నిజమైన అర్హులెంతమందో ఇప్పుడు లెక్కలు తీసే పనిలో ఆఫీసర్లు మునిగిపోయారు.