భద్రాద్రి ఆలయంలో ముగిసిన విచారణ

భద్రాద్రి ఆలయంలో ముగిసిన విచారణ
  • ఈవో, అర్చకుల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో అడిషనల్ కమిషనర్ ​ఎంక్వైరీ 

భద్రాచలం,వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అర్చకులు, ఈవో మధ్య తలెత్తిన వివాదంపై గురువారం విచారణ జరిగింది. హైదరాబాద్ నుంచి ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్​కృష్ణవేణి, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్​కృష్ణప్రసాద్, వరంగల్​డిప్యూటీ కమిషనర్​సంధ్యారాణి, ఖమ్మం అసిస్టెంట్​కమిషనర్​వీరస్వామి టీమ్ వచ్చి రంగనాయకుల గుట్టపైన అల్లూరి నిలయంలో ఇరువర్గాలతో మాట్లాడి వివరాలు తీసుకుంది.

హోలీ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం ఆలస్యంగా జరిగింది. యాజ్ఞిక బ్రహ్మ శ్రీనివాస రామానుజం పర్ణశాలకు బదిలీ కాగా.. అతను సంప్రదాయం ప్రకారం ఉండాలని అర్చకులు పట్టుబట్టారు. ఈవోను అభ్యర్థించినా సమయానికి తీసుకురాకపోవడంతో నిరసన తెలిపారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు చేపట్టాల్సిన అంకురార్పణ కార్యక్రమం రాత్రి 9.30 గంటలకు జరిగింది.

మూడున్నర గంటలు ఆలస్యం కావడంతో వివాదం తలెత్తింది. దీంతో ఎండోమెంట్​కమిషనర్​హరీశ్​విచారణ చేయాలని అడిషనల్ కమిషనర్​ను ఆదేశించగా ఆమె వచ్చారు. విచారణ కమిటీ ఎదుట తమకు సంప్రదాయాలు ముఖ్యమని అర్చకులు స్పష్టంచేశారు. ఎప్పటికప్పుడు ఈవోకు తెలిపిన లెటర్లను తీసుకోవడంతో పాటు ఈవో నుంచి కూడా వివరణ తీసుకుంది. అనంతరం అడిషనల్ కమిషనర్​ కృష్ణవేణి మాట్లాడుతూ వివాదంపై వివరాలు, పరిస్థితిని పరిశీలించమని కమిషనర్​ఆదేశించడంతో వచ్చినట్లు చెప్పారు. ఇరువర్గాలతో మాట్లాడామని తెలిపారు. 

ఇద్దరు జూనియర్​ అసిస్టెంట్ల సరెండర్

ఆలయానికి చెందిన ఇద్దరు జూనియర్​అసిస్టెంట్లను హైదరాబాద్ లోని ఎండోమెంట్ కమిషనర్​ఆఫీసుకు సరెండర్​చేస్తూ ఈవో రమాదేవి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. యాదగిరిగుట్టకు దేవస్థానం నుంచి ఆగారెడ్డి, వేములవాడ నుంచి శివరామ్​బదిలీల్లో భాగంగా భద్రాచలం దేవస్థానానికి వచ్చారు. శివరామ్​జాయినింగ్ నాటి నుంచి లీవ్ పెట్టి హాజరు కావడంలేదు.

ఆగారెడ్డి మద్యం తాగి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ.. ఎలాంటి సమాచారం లేకుండా డ్యూటీకి డుమ్మా కొడుతురంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వీరిని ఎండోమెంట్​కమిషనర్​ఆఫీసుకు సరెండర్ చేశారు.