వైభవంగా భద్రాద్రి రాముడి తెప్పోత్సవం..

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో శ్రీసీతారాముల తెప్పోత్సవం వైభవంగా జరిగింది. హంసాలంకృత వాహనంపై శుక్రవారం రాత్రి స్వామివారు జలవిహారం చేశారు. ఏటా ముక్కోటి పర్వదినానికి ముందు రోజు స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా భారీగా తరలి వచ్చారు. గతం కంటే ఈసారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం గోదావరి నుంచి తీర్థ బిందెను తెచ్చి రామయ్యకు గర్భగుడిలో పంచామృతాలు, విశేష నదీ జలాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం జరిగాయి. మూలవరులను స్వర్ణ కవచాలతో అలంకరణ చేశారు. బాలబోగం నివేదించారు. ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి తిరుప్పావై పాశురాల పారాయణం జరిగింది. చతుర్వేద పారాయణాలు, నాళాయర దివ్యప్రబంధ పారాయణం చేశారు. కీలకమైన ఘట్టం తిరుమంగై ఆళ్వార్​పరమపదోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమంగై ఆళ్వార్‍ను గర్భగుడికి తీసుకొచ్చి అర్చనలు చేశారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన హంసా వాహనంలో స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహించారు. కాగా, అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం వైకుంఠ ఉత్తర ద్వారంలో భక్తులకు రామయ్య దర్శనం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.