భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో సగం రేషన్ ​షాపులు తెరవట్లే!

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో  సగం రేషన్ ​షాపులు తెరవట్లే!
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 443 షాపుల్లో 217 మాత్రమే ఓపెన్
  • సన్న బియ్యం కోసం షాపుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు
  • నిర్లక్ష్యంలో రేషన్​ డీలర్లు..  కొరవడిన ఆఫీసర్ల పర్యవేక్షణ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని ఆఫీసర్లు, డీలర్లు నీరు గారుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 443 రేషన్​ షాపులు ఉండగా, సోమవారం అందులో సగం షాపులను మాత్రమే డీలర్లు తీశారు. మిగతా చోట్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. షాపు ఎప్పుడు తీస్తారో.. బియ్యం ఎప్పుడిస్తారో అంటూ రేషన్​ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. 

కొన్ని ఓపెన్ చేస్తలేరు.. మరికొన్ని టైం పాటిస్తలేరు.. 

జిల్లాలో 443 రేషన్​ షాపులు ఉండగా, 2.93లక్షల  ఆహార భద్రత కార్డులున్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన సన్న బియ్యం పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కానీ కొందరు రేషన్​ డీలర్లు స్కీమ్​ను  నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా కేవలం 217 రేషన్​ షాపులు మాత్రమే ఓపెన్​ అయ్యాయి. కొత్తగూడెం పట్టణంలోని మధుర బస్తీలో గల రేషన్​ షాపు నాలుగు రోజులుగా తెరుచుకోలేదు. రామా టాకీస్​ రోడ్​తో పాటు రామవరంలోని కొన్ని షాపులు తమకు టైం ఉన్నప్పుడే తీస్తూ మమ అనిపిస్తున్నారు.

ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటలకు వరకు రేషన్​ షాపులను తీయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. షాపులపై సివిల్​ సప్లై ఉన్నతాధికారులతో పాటు డిప్యూటీ తహసీల్దార్ల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో రేషన్​ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాగా, జిల్లాలో పదుల సంఖ్యలో బినామీ డీలర్లున్నారు. కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లో కొందరు డీలర్లలో ఒక్కొక్కరు మూడు రేషన్​ షాపులకు పైగా మెయింటెనెన్స్​ చేస్తుండడం గమనార్హం.

మూడు రోజులుగా వస్తున్నా షాపు తీయట్లే.. 

సన్న బియ్యం వస్తున్నాయని ఆశతో మూడు రోజులుగా షాపు వద్దకు వస్తున్నా ఎప్పుడూ తెరిచి ఉండడం లేదు. షాపు ఎప్పుడు తీస్తారో కూడా తెలియడం లేదు. ఎవరినైనా అడుగుదామన్నా ఇక్కడ ఎలాంటి వివరాలు పెట్టలేదు. కనీసం డీలర్​ ఫోన్ ​నంబర్​ కూడా లేదు. లక్ష్మి, లబ్ధిదారురాలు, కొత్తగూడెం.   

చర్యలు తీసుకుంటాం..

సరిగా ఓపెన్​ చేయని రేషన్​షాపులను గుర్తించి చర్యలు తీసుకుంటాం. సమయ పాలన ప్రకారంగా రేషన్​ షాపులను తెరిచి లబ్ధిదారులకు అందుబాటులో ఉండాలి. అలా చేయకుంటే డీలర్లపై చర్యలు తప్పవు 
- రుక్మిణి దేవి, సివిల్​ సప్లై ఆఫీసర్, భద్రాద్రికొత్తగూడెం.

5,100 మెట్రిక్​ టన్నులు ట్రాన్స్​పోర్టు చేశాం 

ఖమ్మం జిల్లాలోని రేషన్​ షాపులకు దాదాపు 5,450 మెట్రిక్​ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు 5,100 మెట్రిక్​ టన్నుల సన్న బియ్యాన్ని షాపులకు ట్రాన్స్​ పోర్టు చేశాం. 350మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని  మంగళ, బుధవారం లోపు ట్రాన్స్​పోర్టు చేస్తాం. - త్రినాథ్, సివిల్​ సప్లై డీఎం, భద్రాద్రికొత్తగూడెం.