![ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి](https://static.v6velugu.com/uploads/2025/02/bhadradrikothagudem-collector-jitesh-v-patil-ensures-public-health-and-transparency_rwSvLlOzTM.jpg)
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్అధికారులకు సూచించారు. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులతో గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గర్భిణులను 12 వారాల లోపు ఎంసీహెచ్ పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. ఏదైనా ప్రమాదకరమైన వ్యాధులు ఉంటే గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన యంత్ర పరికరాలు, సామగ్రి కోసం నివేదికలను శుక్రవారం లోపు అందజేయాలని ఆదేశించారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు వేయాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ డిప్యూటీ డీఎంహెచ్‌వో సుకృత, వైద్యాధికారులు బాలాజీ, చైతన్య, మధు, స్పందన, డిప్యూటీ డెమో ఫైజ్ మోహిఉద్దీన్ పాల్గొన్నారు.
పొరపాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి
ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పాతకొత్తగూడెంలోని ఆనంద్ఖని జడ్పీ హైస్కూల్లో ఆర్వో, ఏఆర్వోలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. జిల్లా పంచాయతీ ఆఫీసర్ చంద్రమౌళి మాట్లాడుతూ త్వరలోనే పీవోలు,ఏపీవోలకు ట్రైనింగ్ఉంటుందని చెప్పారు.
మూడు చెక్ పోస్టుల ఏర్పాటు
జిల్లాలోని అంతరాష్ట్ర సరిహద్దుల్లో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా కేసులు నమోదవుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కోళ్ల దిగుమతిని అరికట్టేందుకు అశ్వారావుపేట, దమ్మపేట, చర్ల మండలాల్లోని సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పౌల్ట్రీ ఫాంలను పర్యవేక్షించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.
అక్రమాలు జరిగితే చర్యలు
భద్రాచలం : ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. చర్ల మండలంలోని చింతకుంట, మొగళ్లపల్లి ఇసుక రీచ్‌లను ఆయన తనిఖీ చేశారు. రిజిస్టర్లు, స్టాక్ పాయింట్లు పరిశీలించారు. లోడింగ్ చేస్తున్న ట్రాక్టర్, లారీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేయొద్దని సూచించారు.
తులసి మొక్కలు నాటాలి
పర్ణశాల ఆలయ ప్రాంగణంలో విస్తృతంగా తులసి మొక్కలు నాటాలని కలెక్టర్ దేవస్థానం ఈవో రమాదేవికి సూచించారు. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో ఔషధ మొక్కలు, తులసి మొక్కలను విరివిగా నాటాలన్నారు.