శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్

భద్రాచలం, వెలుగు : ఏప్రిల్​లో జరిగే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాముల కల్యాణం, శ్రీరామపట్టాభిషేకం వైభవంగా నిర్వహిద్దామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్ అన్నారు. దీనిపై గురువారం భద్రాచలం ఆర్డీవో ఆఫీసులో జిల్లా స్థాయి ఆఫీసర్లతో ఆయన రివ్యూ నిర్వహించారు. కల్యాణం చూసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. భక్తులు ఒక సెక్టార్​ నుంచి మరో సెక్టార్​కు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఆన్​లైన్​ ద్వారా 75 శాతం టిక్కెట్లు కేటాయించాలని, 25 శాతం మాత్రమే మాన్యువల్​గా విక్రయించాలని సూచించారు. ఈనెల 31  లోపు ఐటీసీ ద్వారా నిర్మించే టాయిలెట్లను కంప్లీట్​ చేయాలన్నారు. 

తాగునీటి సరఫరాలో ఆర్​డబ్ల్యూఎస్​, పంచాయతీరాజ్​ శాఖలు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వాహనాల పార్కింగ్​ లో ఇబ్బందులు ఉండొద్దని చెప్పారు. గోదావరి తీరంలో రెస్క్యూ టీంలు ఎప్పుడూ ఉంచాలన్నారు. స్నానఘట్టాల వద్ద షవర్​ బాత్​లు పెట్టాలని సూచించారు. 24 గంటలూ పనిచేసేలా వైద్య కేంద్రాలను పెట్టాలన్నారు. వేసవి దృష్ట్యా వడదెబ్బకు గురైన వారిని తరలించేందుకు 108 అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఫుడ్​ ఇన్స్ పెక్టర్​ వెంటనే టెంపుల్లో ప్రసాదాలకు వినియోగించే ఆహార పదార్థాలను పరీక్షించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

స్థానిక హోటళ్లనూ తనిఖీ చేయాలన్నారు. భక్తుల కోసం స్పెషల్ సర్వీసులు తిప్పాలని ఆర్టీసీ ఆఫీసర్లను ఆదేశించారు. భద్రాచలం తరహాలోనే పర్ణశాలలోనూ ఏర్పాట్లు ఉండాలని ఆఫీసర్లకు సూచించారు. ఐటీడీఏ పీవో రాహుల్​ మాట్లాడుతూ 24 గంటలూ టౌన్​లో శానిటేషన్​ కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ రోహిత్​రాజ్​ మాట్లాడుతూ రెండు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం ఈనెల 8న జరిగే మహిళా దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. మీటింగ్​లో అడిషనల్ కలెక్టర్​ వేణుగోపాల్, ఏఎస్పీ విక్రాంత్​సింగ్, డీఆర్​డీవో విద్యాచందన, ఆర్డీవో దామోదర్ ​
పాల్గొన్నారు.

బీసీ హాస్టల్ తనిఖీ 

భద్రాచలంలోని బీసీ హాస్టల్​ను కలెక్టర్​ జితేశ్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజువారీ భోజనాన్ని ఎవరెవరు రుచి చూస్తున్నారంటూ ఆరా తీశారు. గదులకు డోర్లు, కిటికీలు, మరుగుదొడ్లకు డోర్లు, మెయిన్​ గేట్​ సరిగా లేకపోవడాన్ని గమనించి వెంటనే రిపేర్లు చేయించాలని ఆఫీసర్లను ఆదేశించారు. 

ఇందిరమ్మ ఇండ్ల​లో పేదలకు ప్రాధాన్యత 

భద్రాద్రికొత్తగూడెం :  ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో పేదలు, దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్​ ఆఫీసర్లకు సూచించారు. పలు శాఖల జిల్లా, మండల ఆఫీసర్లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలన్నారు. పెండింగ్​లో ఉన్న ఎల్ఆర్ఎస్​ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ధరణి మాడ్యూల్​లో పెండింగ్​ దరఖాస్తుల విషయంలో ఆఫీసర్ల తీరుపై కలెక్టర్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.