భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లో 13 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని శనివారం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారన్నారు. ఎస్పీ బి.రోహిత్ రాజు మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 31 వరకు పోలీసుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఖమ్మం టౌన్ : రక్తదానంతో ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలవుదామని ఖమ్మం సీపీ సునీల్ దత్ అన్నారు. సీటి ఆర్ముడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదానం చేసిన పోలీసులు, ఆటో డ్రైవర్ల, ప్రజలను సీపీ అభినందించారు. శిబిరంలో 100 మంది రక్తదానం చేశారు. వారికి సర్టిఫికెట్లు అందజేశారు.
పాల్వంచ : పాల్వంచ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన శిబిరంలో డీఎస్పీ సతీశ్‌కుమార్, సీఐ వినయ్ కుమార్, కేటీపీఎస్ అసిస్టెంట్ కమాండెంట్ అప్పాజీ పాల్గొని రక్తదానం చేశారు. 30 మంది కేటీపీఎస్ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది, స్థానికులు 100 మంది ఈ శిబిరంలో పాల్గొన్నారు.
అశ్వారావుపేట : అశ్వారావుపేట స్టేషన్ లో సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 52 మంది రక్తదానం చేశారు. వీరికి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రూట్స్, జ్యూస్ పంపిణీ చేశారు.
ఇల్లెందు : పట్టణంలోని ఐత ఫంక్షన్ హాల్ లోనిర్వహించిన రక్తదాన శిబిరంలో ఇల్లెందు డీఎస్పీ ఎన్. చంద్రభాను మాట్లాడారు. అన్ని దానాల కన్నా రక్తదానం ఎంతో గొప్పదన్నారు.