- భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మన ఊరు – మన బడి పథకానికి ఫండ్స్కొరత లేదని భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ లో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు రూ.43 కోట్ల పనులు చేయగా, రూ.41 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. నిధుల కొరత ఉందని వస్తున్న వదంతులను కాంట్రాక్టర్లు నమ్మొద్దన్నారు. 86 స్కూల్బిల్డింగులకు నెలాఖరులోగా రంగులు వేయించాలని ఆదేశించారు. మిగిలిన స్కూళ్లలో పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
వర్షపు నీరు నిలుస్తున్న స్కూళ్లలో మొరం పోసేందుకు నివేదికలు అందజేయాలన్నారు. బ్లాక్బోర్డుల స్థానంలో గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పనులు స్లోగా సాగడంపై కలెక్టర్అసహనం వ్యక్తం చేశారు. కరకగూడెంలో 100 శాతం సివిల్పనులు పూర్తి చేయడంపై అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో డీఈఓ సోమశేఖరశర్మ, వివిధ శాఖల అధికారులు నాగశేషు, బీమ్లా, సురేశ్, శ్రీనివాస్, మంగ్యా, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.