కొత్తగూడెంలో పర్మిషన్​ లేకుండానే యథేచ్ఛగా నిర్మాణాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారం, పైరవీ, పైసలు ఉంటే చాలు అప్పటి వరకు అక్రమంగా ఉన్న నిర్మాణాలు కూడా సక్రమంగా మారుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చామని చెప్పి తప్పించుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే చర్యలు తీసుకుంటామని తప్పించుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ అనుదీప్​ పలుమార్లు అధికారులను ఆదేశించినా బేఖాతరు చేస్తున్నారు.

చేతులెత్తేస్తున్న ఆఫీసర్లు..
ఏజెన్సీ నిబంధనలు పాటించకుండా, పంచాయతీ నుంచి పర్మిషన్​ లేకుండా అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, చుంచుపల్లి మండలాల్లో మెయిన్​రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలంలోని మోర్​షాప్​ సెంటర్​తో పాటు సమీప ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతున్నాయి. ఎంపీడీవో, పంచాయతీ ఆఫీస్​కు కూతవేటు దూరంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం నుంచే ఆఫీసర్లు రాకపోకలు సాగిస్తున్నా వీటిని పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డీవో నుంచి పర్మిషన్​ తీసుకుని కూల్చివేస్తామంటూ ఎంపీఓ శ్రీనివాస్  చెబుతున్నారు. నోటీసులు ఇచ్చాం.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఇంతకన్నా ఏం చేయాలంటూ పంచాయతీ సెక్రటరీ అంటున్నారు. మమ్మల్ని అధికారులేమీ చేయలేరు.. ఎవరైనా కంప్లైట్​ చేస్తే ఒకటి, రెండు రోజులు పనులు ఆపేస్తామని అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారు అనడం గమనార్హం. 

చుంచుపల్లి మండలం బైపాస్​రోడ్​ సెంటర్​తో పాటు విద్యానగర్​ పంచాయతీలో ఏజెన్సీ రూల్స్​ను పక్కన పెట్టి చేపట్టిన నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. తమ ముందే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా ఏం చేయలేని పరిస్థితి ఉందని విద్యానగర్​ కాలనీ పంచాయతీ సెక్రటరీతో పాటు ఎంపీవో అనడం విశేషం. కొత్తగూడెం పట్టణం నడిబొడ్డున గణేశ్​​టెంపుల్​ ఏరియాలో రవి ఎలక్ట్రానిక్స్, తహసీల్దార్​ ఆఫీస్​ సమీపంలో ఓ బిల్డింగ్​తో పాటు బూడిదగడ్డ ఏరియా, పాత కొత్తగూడెం, మేదరబస్తీ ప్రాంతాల్లో టాస్క్​ఫోర్స్​ ఆఫీసర్లు అక్రమ నిర్మాణాలని పేర్కొంటూ ఫ్లెక్సీలు పెట్టి వెళ్లి పోయారు. కొద్ది రోజుల తర్వాత అధికార పార్టీ లీడర్లతో కలిసి పైరవీ చేసుకొని పనులు పూర్తి చేశారు. ఇదిలాఉంటే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ అనుదీప్​ పలు సమావేశాల్లో ఆదేశిస్తున్నా అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయి. కలెక్టర్​ సీరియస్​ అయిన సమయంలో హడావుడి చేసి ఆ తరువాత పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.