భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం/చర్ల/అన్నపురెడ్డిపల్లి/చండ్రుగొండ/జూలూరుపాడు/అశ్వారావుపేట, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున 4 గంటలకు చినుకులతో మొదలై దంచికొట్టింది. కొన్ని గ్రామాల్లో సాయంత్రం వరకు సన్నగా కురుస్తూనే ఉంది. జూలూరుపాడులో అత్యధికంగా11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అశ్వాపురంలో 10.2, దమ్మపేటలో 9.8, సుజాతనగర్లో 8.5, టేకులపల్లిలో 6.1, చండ్రుగొండలో 6.0, అన్నపురెడ్డిపల్లిలో 4.7, ఇల్లెందులో 3.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వానలతో ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు సింగరేణి ఓపెన్కాస్ట్మైన్లలో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. జిల్లాతోపాటు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలతో గోదావరికి వరద పెరుగుతోంది.
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. అధికారులు రెండు గేట్లు ఎత్తి 9,076 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంతోపాటు శాంతినగర్ గ్రామాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతోనే వాన నీరు నేరుగా ఇండ్లలోకి వస్తోందని జనం మండిపడుతున్నారు. రాజాపురం, జానకీపురం, అబ్బుగూడెం, మర్రిగూడెం గ్రామాల్లోని రైతులు వరి నాట్లు మొదలుపెట్టారు. జూలూరుపాడు మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పత్తి చేలలో వాన నీరు నిలిచింది. నర్సాపురం, బేతాలపాడు గ్రామాల మధ్యలో ఉన్న తుమ్మలవాగు పొంగిపొర్లింది. పంచాయతీ అధికారులు ఇరువైపులా ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి రాకపోకలు బంద్ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నదికి జలకళ సంతరించుకుంది.
బుధవారం వరకు 2 అడుగుల్లో ఉన్న నీటిమట్టం గురువారానికి 15 అడుగులకు చేరింది. మేడిగడ్డ బ్యారేజీ, తాలిపేరు ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి వరద వస్తోంది. చండ్రుగొండ మండలం కేంద్రం సహా గుర్రాయిగూడెం, రావికంపాడు, బెండాలపాడు, పోకలగూడెం, తిప్పనపల్లి గ్రామాల్లోని పత్తి పొలాలు పూర్తిగా నీటమునిగాయి. వర్షం ఆగిన వెంటనే నీటిని బయటికి పంపే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. చండ్రుగొండ, రావికంపాడులో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వరద నీరు నేరుగా ఇండ్లలోకి చేరిందని జనం వాపోయారు. అశ్వరావుపేటలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.
నెహ్రూనగర్ లో ఎండిన చెట్టు కొమ్మవిరిగి కరెంట్లైన్మీద పడడంతో తీగలు తెగిపడ్డాయి. దీంతో కరెంట్సరఫరా నిలిచింది. అంకమ్మ చెరువు అలుగు పారడంతో వాగొడ్డుగూడెం వంతెనపై 3 అడుగుల మేర వరద పారింది. రాకపోకలు నిలిచాయి. పెద్దవాగు ప్రాజెక్ట్ మూడు గేట్లు తెరిచి ఉండటంతో 5 వేల క్యూసెక్కుల నీరు గోదావరి పాలైందని రైతులు వాపోయారు. ప్రాజెక్టు గేట్ల రిపేర్లు జూన్ నెలలోనే పూర్తికావాల్సి ఉన్నా, నేటికీ పూర్తికాలేదు.
మూణ్నాళ్ల ముచ్చటగా బీటీ రోడ్డు
రూ.4 కోట్ల50 లక్షలతో జూలూరుపాడు మండలం నర్సాపురం నుంచి కాకర్ల, గానుగపాడు గ్రామాలను కలుపుతూ పోకలగూడెం వరకు ఇటీవల 12 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించారు. గురువారం కురిసిన ఒక్క వానకే కాకర్ల సమీపంలోని చప్టా వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. ఎక్కడికక్కడ పెచ్చులూడింది. రోడ్డు పక్కన పోసిన మొరం కొట్టుకుపోయి గోతులు ఏర్పడ్డాయి. పనుల్లో క్వాలిటీ లోపిస్తే ఇలాగే ఉంటుందని వాహనదారులు మండిపడుతున్నారు.