- గతేడాది కన్నా తగ్గిన బడ్జెట్ ప్రతిపాదనలు
- కొత్తగూడెం మున్సిపాలిటీ గత బడ్జెట్లో పొంతన లేని లెక్కలు
- తాజాగా రూ.81.56కోట్లతో కొత్తగూడెం, రూ. 15కోట్లతో ఇల్లెందు, రూ. 80కోట్లతో
- పాల్వంచ మున్సిపల్ బడ్జెట్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఈ సారి వాస్తవ బడ్జెట్‌కు పాలకులు, ఆఫీసర్లు ప్రాధాన్యత ఇచ్చారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్తగూడెం మున్సిపల్ బడ్జెట్‌ను రూ. 81.56కోట్లతో, ఇల్లెందు మున్సిపల్ బడ్జెట్‌ను రూ. 15.76కోట్లతో పాలకవర్గం ఆమోదించింది. పాల్వంచ మున్సిపల్ బడ్జెట్‌ను రూ. 80కోట్లతో కలెక్టర్ ఆమోదించారు. మణుగూరు మున్సిపల్ బడ్జెట్ రూపకల్పన తుదిదశకు చేరుకుంది.
తగ్గిన బడ్జెట్..
గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ సారి బడ్జెట్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. వాస్తవ బడ్జెట్ రూపకల్పన మూలంగానే గతేడాది మీద ఈ సారి బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయని పాలకులు, అధికారులు పేర్కొంటున్నారు. వారం రోజుల ముందుగా మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంకెల గారడీ వద్దు.. వాస్తవ బడ్జెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లను ఆదేశించారు.
దీంతో ఈ సారి వాస్తవ బడ్జెట్ రూపకల్పనపై ఆఫీసర్లు, పాలకులు దృష్టి సారించారు. గతేడాది బడ్జెట్ ఎక్కువగా చూపించాలని పాలకులు ఇష్టారాజ్యంగా బడ్జెట్‌ను రూపొందించారనే ఆరోపణలున్నాయి. వాస్తవ బడ్జెట్ కాకపోవడంపై గత బడ్జెటపై అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలున్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో ప్రస్తుత బడ్జెట్ రూ. 81.56కోట్లతో ఆమోదించగా, గతేడాది రూ.147.92కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించారు.
ఇల్లెందు మున్సిపాలిటీలో ప్రస్తుతం రూ. 15.76కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించగా, లాస్ట్ ఇయర్లో రూ. 40కోట్లతో ఆమోదించిన దాఖలాలున్నాయి. పాల్వంచలో ప్రస్తుతం రూ. 80కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించగా, గతేడాది రూ. 125కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించారు. మణుగూరు మున్సిపాలిటీ బడ్జెట్ ఫైనల్ దశలో ఉంది. ఇదిలా ఉండగా ఆయా మున్సిపాలిటీల్లో ఆమోదించిన బడ్జెట్లో ప్రజా సమస్యల పరిష్కారానికి నిధుల కేటాయింపులు పెద్దగా లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత బడ్జెట్.. ‘కొత్తగూడెం’ పరిస్థితి!
కొత్తగూడెం మున్సిపాలిటీలో గత బడ్జెట్లో అంచనా వ్యయం రూ. 4.28 కోట్లు చూపించగా, 5.46 కోట్లు ఖర్చు చేసినట్టుగా చూపించారు. సెంట్రల్ లైటింగ్‌కు రూ. 16.44లక్షలు ఖర్చు చేసినట్టు చూపెట్టారు. పట్టణంలోని సూర్యా ప్యాలెస్, శేషగిరిభవన్ రోడ్డు, సూర్యోదయ స్కూల్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ ఎక్కడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. వీధిదీపాల ఏర్పాటు కోసం రూ. 67.10లక్షలు అంచనా వ్యయం వేసి ఖర్చు మాత్రం రూ. 49లక్షలు మాత్రమే చూపించడం గమనార్హం.
మరో వైపు 36 వార్డులలో కరెంట్ పోల్స్ ఏర్పాటులో జాప్యం చేస్తుండడం పట్ల పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సంత, డైలీ మార్కెట్ పేర మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయం, కాంట్రాక్టర్లు ఎంతకు వేలంలో దక్కించుకున్నారు.. లాంటి లెక్కలు చూపించకపోవడం పట్ల కౌన్సిలర్లు పాలకవర్గంతో పాటు ఆఫీసర్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఫండ్స్ తెచ్చుకోవడంలో విఫలం..
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ద్వారా ఫండ్స్ తెచ్చుకోవడంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పాలకవర్గం పూర్తి స్థాయిలో విఫలమైంది. రాష్ట్రంలో, మున్సిపాలిటీలో అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పటికీ ఈ ఫండ్స్ తెచ్చుకోవడంలో నిర్లక్ష్యంతో అభివృద్ధిలో కొంత వెనుకబాటులో ఉన్నామంటూ కౌన్సిలర్లు వాపోతున్నారు. పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్, రైతు మార్కెట్, నేతాజీ మార్కెట్ ప్రాంతాల్లో రూ. లక్షలు వెచ్చించి వీధి వ్యాపారులు, చిరు వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్స్ గత ఏడాదిన్నర కాలంగా నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని వీధి వ్యాపారులు, చిరువ్యాపారులకు అప్పగించి నామమాత్రపు ఫీజుతో మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు.
గత బడ్జెట్‌కు సంబంధించి ప్రైవేట్, గవర్నమెంట్ ఆస్థులపై నీటి సరఫరా చార్జీల కింద రూ. 2కోట్ల అంచనా ఆదాయం చూపించిన అధికారులు వాస్తవ ఆదాయాన్ని కేవలం రూ. 87.13లక్షలే చూపించారు. కంపోస్ట్ ఎరువు అమ్మకం ద్వారా రూ. 3లక్షలు అంచనా ఆదాయం చూపించినా వాస్తవ ఆదాయం జీరో చూపించడం గమనార్హం. కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నామని పాలకులు, అధికారులు గొప్పలు చెప్తున్నారు. బడ్జెట్ రిపోర్టులో మాత్రం ఆదాయం జీరో చూపించడంలో ఆంతర్యమేమిటో ఆఫీసర్లకే తెలియాలి. ప్లాస్టిక్ వాడకం, ఇతరత్రా జరిమానాల కింద అంచనా ఆదాయం రూ. 10లక్షలు చూపించారు. వాస్తవ ఆదాయం మాత్రం కేవలం రూ. 5వేలకే పరిమితమయ్యారు. ప్లాస్టిక్ వాడకం యథేచ్ఛగా సాగుతున్నా ఆఫీసర్లు, పాలకులకు పట్టింపు లేకుండా పోయింది.
ప్రాపర్టీ ట్యాక్స్..
ప్రాపర్టీ ట్యాక్స్ అంచనా ఆదాయం రూ. 5.80 కోట్లు చూపించారు. జనవరి చివరి నాటికి రూ. 2.85కోట్లు వాస్తవ ఆదాయంగా పేర్కొన్నారు. మరి రూ. 2.95కోట్లు మార్చి లోపు చూపిస్తారా, మార్చి తర్వాత వసూలు చేస్తారో తెలియని పరిస్థితి. కొత్తగూడెం మున్సిపల్ జనరల్ ఫండ్ దాదాపు రూ. 6.52కోట్లు అంచనా వ్యయంగా పేర్కొన్న అధికారులు వాస్తవ ఆదాయాన్ని రూ. 3.58కోట్లుగా చూపించారు. ఓ వైపు 100శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నా మని చెప్తున్న అధికారులు, పాలకులు ఈ అంచనాలు వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారా? ఏదో అంకెలు వేసి గారడీ చేస్తే సరిపోతుందని అనుకున్నారో? చెప్పాలని పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆదాయపు వనరులున్నా సమకూర్చుకోవడంలో కొత్తగూడెం మున్సిపాలిటీ విఫలమైందని అధికార బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే విమర్శిస్తుండడం గమనార్హం.
‘కొత్తగూడెం-పాల్వంచ కార్పొరేషన్’కు కృషి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీ ఆఫీస్‌లో మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ కె. సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన బడ్జెట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం మున్సిపాలిటీల అభివృద్ధిలో భాగంగా నిధుల కోసం ముఖ్యమంత్రిని కలవనున్నట్టు తెలిపారు.
వాస్తవ బడ్జెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 81.56కోట్ల ఆదాయం, రూ. 83.52కోట్ల ఖర్చుతో బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించింది. ఈ మీటింగ్‌లో డీఆర్డీఓ విద్యాచందన, మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మున్సిపల్ మేనేజర్ సత్యనారాయణ, డీఈ రవి కుమార్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
‘ఇల్లెందు’కు ప్రత్యేకంగా నిధులు తెస్తాం.. : కోరం
ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మున్సిపాలిటీ ఆఫీస్‌లో ఏర్పాటైన సమావేశంలో రూ.15కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ ప్రోగ్రాంలో మున్సిపల్ కమిషనర్ నవీన్ కుమార్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.