ఇల్లెందు(టేకులపల్లి), వెలుగు : ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలని భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు అధికారులకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి, కారుకొండ రామవరం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను బుధవారం ఆయన తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల సమీపిస్తున్నందున డబ్బు, మద్యం అక్రమ రవాణా చేస్తారని, వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎవరైనా చెక్‌పోస్ట్ వద్ద సిబ్బందికి ఇబ్బందులు కలిగిస్తే వెంటనే పై అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
అనంతరం పట్టణంలోని సింగరేణి ఎయిడెడ్ హై స్కూల్ లోని స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ఇల్లెందు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లు, రూట్ మ్యాప్‌ల వివరాలను డీఎస్పీ చంద్ర భానును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐలు కరుణాకర్, సురేశ్, ఎస్సబీ ఇన్స్పెక్టర్నాగరాజు,ఎస్సై సందీప్ ఉన్నారు.