ఎమ్మెల్యేలు చెప్పిన వారికే స్కీంలా?

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్లకే ఆఫీసర్లు స్కీంలు ఇస్తున్నారని జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య ఆరోపించారు. కొత్తగూడెంలోని జడ్పీ ఆఫీస్​లో బుధవారం ఏర్పాటైన ఏడు స్థాయీ సంఘాల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. స్కీంలన్నీ ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్లకే ఇస్తే అర్హులైన పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బీసీ కార్పోరేషన్​ ఆధ్వర్యంలో రూ. లక్ష లోన్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరాలు లేకపోవడంతో లబ్దిదారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. 

గొర్రెల పంపిణీలో  నాణ్యమైన గొర్రెలను ఇచ్చే విధంగా ఆఫీసర్లు కృషి చేయాలన్నారు. వానాకాలంలో వ్యాధుల భారిన పడకుండా దోమల నివారణకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను కోరారు.  జడ్పీ స్థాయీ  సంఘాలకు తమ కింది స్థాయి సిబ్బందిని పంపిస్తూ  పలువురు జిల్లా అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీఈఓ విద్యాలత,  వైస్​ చైర్మన్,  డిప్యూటీ సీఈఓ నాగమణి, జడ్పీటీసీలు , అధికారులు పాల్గొన్నారు.