- కల్యాణ రామునికి మహదాశీర్వచనం
భద్రాచలం, వెలుగు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాద్రిలో కల్యాణ రాముడికి మహదాశీర్వచన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణం తర్వాత నూతన వధూవరులైన దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం ఇవ్వడమే ఈ కార్యక్రమ పరమార్థం. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో నిత్య కల్యాణ వేదిక వద్ద నిర్వహించగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన చతుర్వేద పండితులు పాల్గొన్నారు.
తర్వాత స్వామివారు హంసవాహనంపై రాజవీధి నుంచి తాతగుడి సెంటర్‍లోని గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లి పూజలందుకున్నారు. అంతకు ముందు ఉదయం గర్భగుడిలో మూలవరులకు స్వర్ణ కవచ అలంకారం చేశారు. స్వామికి వివిధ రకాల పూలు, పండ్లతో స్వామికి పూజలు నిర్వహించారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాభిషేకం చేశారు.