- శ్రీరామపునర్వసు దీక్షల విరమణ
భద్రాచలం, వెలుగు : శ్రీరామపునర్వసు దీక్షల విరమణ గురువారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీరామ పునర్వసు దీక్షాపరులు నిర్వహించిన భద్రగిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. ఉదయం దీక్షాపరులు ఆలయానికి చేరుకోగా తిరువడి కార్యక్రమం వేదోక్తంగా సాగింది. ఉత్సవమూర్తులను గర్భగుడి నుంచి బేడా మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
తులసిమాలలు, రామపాదుకలకు అర్చకులు పూజలు చేసి తిరువడిని దీక్షాపరుల శిరస్సుపై ఉంచారు. ఈవో ఎల్.రమాదేవి రామపాదుకలను శిరస్సుపై ధరించి దీక్షాపరులతో కలిసి భద్రగిరి ప్రదక్షిణ చేశారు. రెండుసార్లు భద్రుని కొండ చుట్టూ తిరిగి మూడోసారి భద్రాచలం పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకోగానే భద్రుని మండపంలో భక్తులు తిరువడి సమర్పించి శ్రీరామపునర్వసు దీక్షలను విరమించారు.
శ్రీసీతారామచంద్రస్వామికి నిర్వహించిన నిత్య కల్యాణంలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామికి దర్బారు సేవ నిర్వహించాక రాపత్ సేవను గోదావరి తీరంలోని శ్రీరామపునర్వసు మండపంలో కన్నుల పండువగా జరిపారు. ఊరేగింపుగా పల్లకీలో వైకుంఠ రాముడిని ఉంచి రామనామ సంకీర్తనలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య తీసుకెళ్లారు. తర్వాత తిరిగి ఆలయానికి స్వామి చేరుకున్నారు.