భద్రకాళి చెరువు నీటి విడుదల

భద్రకాళి చెరువు నీటి విడుదల

వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్​భద్రకాళి చెరువులోని నీటిని ఖాళీ చేసేందుకు శుక్రవారం అధికారులు పనులు ప్రారంభించారు. సుమారు 900 ఏండ్ల కింద కాకతీయుల నిర్మించిన చెరువులోని నీటిని బయటకు పంపడం ఇదే తొలిసారి. చెరువులో గుర్రపు డెక్క, మట్టి భారీగా పేరుకపోవడంతో నీటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు చెరువు మత్తడిని కొంతభాగం తొలగించారు. నీటి విడుదల సుమారు 15 నుంచి 20 రోజుల పాటు కొనసాగనుంది. చెరువు నీటిని హసన్​పర్తి మండలం నాగారం చెరువుకు తరలిస్తున్నారు. చెరువు విస్తీర్ణం 600 ఎకరాలు ఉండగా.. ప్రస్తుతం 382 ఎకరాలకు తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. 


చెరువును ఖాళీ చేసిన తర్వాత ఎఫ్​టీఎల్, బఫర్ ​జోన్లను పక్కాగా నిర్ణయించాలని అధికారులు ప్లాన్ రెడీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఇరిగేషన్​, మత్స్యశాఖ, బల్దియా అధికారులు చెప్పారు. కాగా.. భద్రకాళీ చెరువు నీటిని ఖాళీ చేస్తుండటంతో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులోని చేపలను పట్టుకున్న తర్వాతనే ఖాళీ చేయాలని కోరారు. దీంతో అధికారులు చేపలు బయటకు వెళ్లకుండా వలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.