వరంగల్‌‌ భద్రకాళి చెరువు ఖాళీ .. చెరువులో పూడికతీతకు నిర్ణయించిన ప్రభుత్వం

వరంగల్‌‌ భద్రకాళి చెరువు ఖాళీ .. చెరువులో పూడికతీతకు నిర్ణయించిన ప్రభుత్వం
  • నీరు మొత్తం బయటకుపోవడంతో తేలిన రాళ్లు, మిగిలిన బురద
  • పూర్తిగా ఎండిన తర్వాత పనులు మొదలుపెట్టేందుకు ప్లాన్‌‌

వరంగల్, వెలుగు : వారం రోజుల కిందటి వరకు నీటితో కళకళలాడిన వరంగల్‌‌ భద్రకాళి చెరువు ప్రస్తుతం బండలు, బురదతో దర్శనమిస్తోంది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువులో పూడికతీత పనులు మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నీళ్లను కిందకు వదిలేశారు. దీంతో చెరువులో ప్రస్తుతం నడుములోతు బురద మిగిలింది. మరో నాలుగైదు రోజుల్లో బురద ఎండిపోయే అవకాశం ఉండడంతో ఆ తర్వాత పూడికతీత పనులు మొదలుపెట్టేందుకు ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు సిద్ధమవుతున్నారు. 

382 ఎకరాల్లో భద్రకాళి చెరువు

గ్రేటర్‌‌ సిటీలో హనుమకొండ, వరంగల్‌‌ నగరాల మధ్య వారధిగా ఉండే భద్రకాళి చెరువు సుమారు 382 ఎకరాల్లో విస్తరించి ఉంది. గతంలో పంటల సాగు కోసం ఈ చెరువులోని నీటినే వినియోగించేవారు. ఆ తర్వాత 1985 వేసవిలో నగర ప్రజలకు మంచినీటిని అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ చెరువును రిజర్వాయర్‌‌గా మార్చారు. కాకతీయ కెనాల్‌‌ ద్వారా వచ్చే నీటిని ఈ చెరువులోకి పంపింగ్‌‌ చేస్తూ 1994 నుంచి నగరంలోని సుమారు 4 లక్షల మందికి మంచినీటిని అందిస్తున్నారు. 

అనంతరం దేవాదుల ప్రాజెక్ట్‌‌ ద్వారా ధర్మసాగర్‌‌ చెరువులోకి గోదావరి జలాలు వస్తుండడంతో వాటిని నగర ప్రజల మంచినీటిగా వాడుతున్నారు. దీంతో ఐదారేళ్లుగా భద్రకాళి చెరువు అలానే ఉండిపోయింది. ఈ చెరువులో నిన్న మొన్నటి వరకు 140 నుంచి 150 మిలియన్‌‌ క్యూబిక్‌‌ ఫీట్ల మేర నీరు నిల్వ ఉంది. చెరువులో పెద్ద ఎత్తున అడవి తుంగ, వ్యర్థాలు చేరడంతో నీటి పైభాగం మొత్తం పచ్చదనంతో కనిపించింది.

యాభై ఏండ్ల తర్వాత పూడికతీత పనులు

భద్రకాళి చెరువు పూడికతీత పనులు యాభై ఏండ్ల తర్వాత చేపడుతున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. భద్రకాళి ఆలయం చుట్టూరా మాఢవీధులు, రాజగోపురాలు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో చెరువు పూడిక పరిస్థితిని స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు.. నవంబర్‌‌ మొదటి వారంలో వరంగల్‌‌కు వచ్చిన ఇన్‌‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. పలువురితో చర్చించిన అనంతరం పనిలో పనిగా చెరువు పూడికతీత పనులు సైతం చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అంతటితో ఆగకుండా పనులు రాబోయే మూడు, నాలుగు రోజుల్లోనే ప్రారంభించాలని చెప్పడంతో ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు భద్రకాళి చెరువును ఖాళీ చేయడంపై దృష్టి పెట్టారు. 

ఒకటి, రెండు మీటర్ల లోతుతో..

మరో యాభై ఏండ్లను దృష్టిలో పెట్టుకొని భద్రకాళి చెరువు పూడికతీత పనులు చేస్తున్నారు. కనీసం ఒకటి, రెండు మీటర్ల లోతులో పూడిక తీయాలని ప్రభుత్వం ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో చెరువులోని నీటినంతా 15 నుంచి 20 రోజుల్లో బయటకు పంపాలని ప్లాన్‌‌ చేశారు. ఈ క్రమంలో హనుమకొండ కాపువాడ మత్తడి నుంచి అలంకార్‌‌ నాలా, పెద్దమ్మగడ్డ మీదుగా నాగారం చెరువులోకి నీటిని తరలించేందుకు ఈ నెల 8న చర్యలు చేపట్టారు. 

కానీ నీటితో పాటు చేపలు బయటకు పోతే తాము తీవ్రంగా నష్టపోతామని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నీరు బయటకు పోయే చోట బలమైన వలలు ఏర్పాటు చేసుకునేందుకు వారికి రెండు రోజులు గడువు ఇచ్చారు. తర్వాత 10వ తేదీ నుంచి నీటి విడుదల మొదలుపెట్టారు. ప్రస్తుతం నీరంతా ఖాళీ కావడంతో చెరువులో బురద మాత్రమే కనిపిస్తోంది. 

మట్టి అమ్మకంతో పాటు సర్కార్‌‌ భూముల్లోని గుంతలు నింపే యోచన

ప్రస్తుతం చలికావడం కావడంతో చెరువులోని బురద మొత్తం ఎండిపోయేందుకు వారం, పది రోజులు పడుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. బురద పూర్తిగా ఎండిన తర్వాత మొదటి దశలో ఒక మీటర్‌‌ చొప్పున, రెండో దశలో మిగతా పూడిక తీసేలా ప్లాన్‌‌ చేస్తున్నారు. అయితే పూడిక తీశాక మట్టిని ఎక్కడ డంప్‌‌ చేయాలని ఆఫీసర్లు ఆలోచన చేస్తున్నారు. అయితే పొలం పనులకు అవసరమని భావించే రైతులతో పాటు ఇటుక బట్టీల వారికి మట్టిని ఇవ్వాలని భావిస్తున్నారు. 

మట్టి అవసరమైన వారు క్యూబిక్‌‌ మీటర్‌‌కు రూ. 140 చొప్పున చలానా కట్టి సొంత వాహనాలు తీసుకొచ్చుకొని మట్టిని తీసుకుపోయేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కాకతీయ కెనాల్‌‌ పనుల కోసం రెడ్డిపురం, ముచ్చర్ల వంటి పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల నుంచి మట్టి తరలించారు. ఇప్పుడు అవి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. భద్రకాళి చెరువు నుంచి వచ్చే మట్టిని ఆ గుంతల్లో నింపి ఆ భూములను సైతం అందుబాటులోకి తెచ్చుకోవాలని ప్లాన్‌‌ చేస్తున్నారు.